కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వైకాపా ఇప్పుడు పోరాటం చేస్తోందనడానికి ఇదే అచ్చమైన ఉదాహరణ..! ఎన్డీయే నుంచి తెలుగుదేశం వైదొలిగిన మరుక్షణం.. భాజపాతో పొత్తు కోసం జగన్ పడుతున్న ఆరాటాన్ని బయటపెట్టే సంకేతాలు ఇవే..! ప్రముఖ పాత్రికేయుడు రాజ్దీప్ సర్దేశాయ్ నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో వైకాపా జనరల్ సెక్రటరీ విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ‘ఎన్డీయే నుంచి టీడీపీ దూరమైతే భాజపాతో పొత్తు కోసం మీరు సిద్ధమా’ అనే ప్రశ్నకు విజయసాయి సూటిగా సమాధానం చెప్పలేదు..!
టీడీపీ మంత్రులు కేంద్రం నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఇండియా టుడే ఛానెల్ ఓ చర్చ పెట్టింది. ఈ చర్చలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తోపాటు, వైకాపా నేత విజయసాయి రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఎవరిస్తారంటే వారితో కలిసి వెళ్తాం అన్నారు. అయితే, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హోదాకి మద్దతు ఇచ్చారనీ, వారితో వైకాపా పొత్తు పెట్టుకుంటుందా అని రాజ్దీప్ అడిగితే… ‘అబ్బే, మాకు కాంగ్రెస్ పై నమ్మకం లేద’ని విజయసాయి చెప్పారు. కాంగ్రెస్ కి చిత్తశుద్ధి లేదని కొట్టిపారేశారు. అంతేకాదు, భాజపా మాత్రమే ప్రత్యేక హోదా ఇవ్వగలదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీపై తమకు అపార నమ్మకం ఉందనీ, తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘అయితే, టీడీపీ పొత్తు తెంచుకోగానే మీరు భాజపాతో చేరతారా’ అని రాజ్దీప్ అడిగితే… దానికి సంబంధంలేని సమాధానం చెప్పారు. హోదా ఏ పార్టీ ప్రకటిస్తుందో వారితో పొత్తు పెట్టుకుంటాం, మా అధ్యక్షుడు జగన్ ఆలోచన ఇదే అన్నారు.
సో.. ఇదండీ వైకాపా వైఖరి..! ప్రత్యేక హోదా ఏ పార్టీ ఇస్తుందో ఆ పార్టీకి మద్దతును ఇస్తారట. కానీ, హోదా ఇస్తామని ఇప్పుడు చెబుతున్న కాంగ్రెస్ ని మాత్రం నమ్మరట..! ఓపక్క కేంద్రం తీరుకి నిరసనగా భాజపాపై అవిశ్వాసం పెట్టడానికి సిద్ధమౌతున్నారు. మరోపక్క, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై నమ్మకం తమకు ఉందనీ, హోదా ఇవ్వగలిగేది మోడీ మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ప్రత్యేక హోదా సాధన ఒక్కటే వైకాపా లక్ష్యమైతే, ఏ పార్టీ ఇచ్చినా వారితో కలిసి పనిచేస్తామన్నదే పార్టీ నిశ్చిత నిర్ణయమైతే … కాంగ్రెస్ కి ఎందుకు మినహాయింపు..? ఏపీకి హోదా రావడం నరేంద్ర మోడీ వల్లనే సాధ్యమౌతుందన్న నమ్మకం ఉన్నప్పుడు… కేంద్రంపై అవిశ్వాసం ఎందుకు పెడుతున్నట్టు..? ఏపీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నా భాజపా విషయంలో విజయసాయి రెడ్డి మాటల్లో ఈ సాఫ్ట్ కార్నర్ దేనికి సంకేతం..? ఇది కదా ద్వంద్వ వైఖరి అంటే..!