అధికారంలోకి అప్పుడే వచ్చేశామని ధీమా వ్యక్తం చేస్తోన్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నేతల అత్యుత్సాహం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అయింది. కొంతమంది నేతలు నేరుగా అధికారులకు ఫోన్ చేసి రాబోతుంది మేమే.. చెప్పింది చేయ్యండంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారని.. ఏపీ సెక్రటేరియట్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. పోలింగ్ రోజు ఘర్షణలకు పాల్పడిన వైసీపీ నేతలపై … వరుసగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి.. క్యాడర్ పై కేసులు పెట్టకుండా ఉండేందుకు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. పోలీస్ అధికారులకు, జిల్లాస్థాయిలో ఉన్న ఎస్పీలకు ఫోన్ చేసి ఇటీవల జరిగిన గొడవలు, అందులో వైసీపీ నేతలను అరెస్ట్ చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాబోతుంది తామేనని సాక్షాత్తు కొంతమంది జిల్లా ఎస్పీలకు ఫోన్ చేసి బెదిరించినట్టు ప్రచారం జరుగుతోంది.
సెక్రటేరియట్ లోని కొంతమంది అధికారులకు ఫోన్ చేసి తమకు తెలియకుండా జీవోలు ఎలా ఇస్తారని ప్రశ్నించటంతోపాటు ఆపధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు చెపితే ఫైళ్లు తీసుకెళ్తారా అంటూ నిలదీయటం ప్రారంభించారు. ఈ వింత పోకడతో అధికారులు సైతం ఆందోళనకు గురవుతున్నారు. రోటీన్ గా పంపే ఫైళ్లను కూడా పెండింగ్ లో ఉంచటం, మరికొన్ని శాఖల్లో కొర్రీలేసి కిందకు పంపించడం లాంటివి చేస్తున్నారు. కొంతమంది అధికారులు తమకు తెలిసిన వారి ద్వారా లోటస్ పాండ్ లోని, జగన్ కోటరీలో ఉన్న కీలక వ్యక్తులతో పరిచయం పెంచుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కొంతమంది ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు కూడా వైసీపీ నేతల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. రాబోయేది తమ ప్రభుత్వమేనని, అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఎవరెమిటో, ఏ అధికారి ఎలా ఉన్నారో ఇప్పటికే జగన్ వద్ద చిట్టా ఉందని కూడా వారు నేతలకు హెచ్చరికలతో కూడిన సూచనలు చేశారని చెప్పుకుంటున్నారు.
వైసీపీ నేతలు మరింత ముందుకు వెళ్లి కేబినెట్ ఊహాగానాల్లో కూడా ఉన్నారని లోటస్పాండ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరెవరికి మంత్రి పదువులు వస్తాయనే అంశంపై వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీచేసిన వారు చర్చించుకుంటున్నారు. ఎవరి గెలిస్తే ఎవరికి మంత్రి పదవి వస్తుందో..?, ఆయా జిల్లాల్లో కులాల వారీగా ఇక్వెషన్లు గురించి కూడా చర్చించుకుంటున్నారు. కౌంటింగ్ కంటే ముందే… జగన్ ప్రమాణస్వీకారం చేయడానికి సిద్ధపడినా ఆశ్చర్యం లేదన్నట్లుగా పరిస్థితి ఉందన్న అభిప్రాయం..టీడీపీలో వ్యక్తమవుతోందంటే… వైసీపీ నేతల ఆత్రుతే కారణం.