తెలంగాణాలో త్వరలో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో వైకాపా అభ్యర్ధిగా కమల్ రాజ్ ని బరిలో దింపింది. ఆయన నిన్న తన నామినేషన్ దాఖలు చేసారు. వైకాపాకు జిల్లాలో 90 సీట్లు ఉన్నందున అది ఒకవేళ పోటీ చేయకున్నా తెరాసకు మద్దతు ఇస్తుందని అందరూ ఊహించారు. కానీ గత ఎన్నికలలో తెరాసకు మద్దతు ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెదేపా నేతలు విమర్శలు గుప్పించడంతో అక్కడి ప్రజలలో తమ పార్టీ పట్ల వ్యతిరేకత ఏర్పడిందని భావించిన వైకాపా ఎన్నికలలో పోటీ చేయడం మొదలుపెట్టింది. అయితే వైకాపా తన అభ్యర్ధిని బరిలో దింపినప్పటికీ తన సభ్యులందరినీ తమ పార్టీ అభ్యర్ధికే ఓటు వేయమని గట్టిగా ఒత్తిడి చేయకపోవచ్చును. వారిలో చాలా మంది తెరాసకే ఓటు వేసే అవకాశం ఉంది. నేరుగా తెరాసకు మద్దతు ఇచ్చి విమర్శలు మూట కట్టుకోవడం కంటే, పోటీ చేసి పరోక్షంగా తెరాసకు సహకరిస్తే ఆ అపవాదు నుండి తప్పించుకోవచ్చని వైకాపా ఆలోచన కావచ్చును.
ఖమ్మం జిల్లాలో తెరాస అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. తెరాసకు మిగిలిన పార్టీలన్నిటి కంటే కొంచెం ఎక్కువ బలం ఉంది కనుక, క్రాస్ ఓటింగ్ జరిగినట్లయితే అవలీలగా గెలిచే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్, తెదేపాల మద్దతుతో సిపిఐ తరపున పువ్వాడ నాగేశ్వర రావు పోటీ చేస్తున్నారు. ఈ మూడు పార్టీలకు కలిపి ఉన్న 225 మంది సభ్యులు క్రాస్ ఓటింగ్ కి పాల్పడకుండా ఆయనకే ఓటు వేసినా ఆయన గెలిచేందుకు జిల్లాలో ఉన్న ఇండిపెండెంట్ సభ్యుల, న్యూ డెమొక్రసి పార్టీకి చెందిన సభ్యుల మద్దతు కూడా అవసరం ఉంటుంది. ఒకవేళ ఈ మూడు పార్టీలకు చెందిన సభ్యులలో ఎవరైనా క్రాస్ ఓటింగ్ పాల్పడి తెరాసకు మద్దతు ఇచ్చినట్లయితే పువ్వాడ గెలుపు అనుమానమే.