వైసీపీ ముఖ్య నేతలకూ కూడా తమ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డా లేకపోతే తెలుగు కూడా సరిగ్గా రాని రిషిరాజా అనే డౌట్ వస్తోంది. ఎందుకంటే పార్టీలో అత్యంత కీలక నిర్ణయాలూ ఆయనే తీసుకుంటున్నారు. ఆయనే చర్చిస్తున్నారు. పార్టీ వ్యవహారాలన్నీ ఆయన టేబుల్ వద్దకు చేరుతున్నాయి. చివరికి బాలినేని శ్రీనివాసరెడ్డితో కూడా ఆయనే ఎక్కువ సేపు మాట్లాడారు. జగన్ రెండు, మూడు నిమిషాలే మాట్లాడారు. ఇప్పుడు రిషిరాజ్ వ్యవహారం వైసీపీలో వింత చర్చలకు కారణం అవుతోంది.
ఎవరీ రిషిరాజ్?
వైసీపీలో అనధికారిక అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్న రిషిరాజ్ ఐ ప్యాక్ ప్రతినిధి. ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష స్ట్రాటజీల నుంచి విరమించుకుని బీహార్ లో రాజకీయ యాత్రలు చేసుకుంటున్నారు. ఆయనకు బదులుగా రిషిరాజ్ బాధ్యతలు తీసుకున్నారు. నిజానికి ఈ రిషిరాజ్ గత ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేసిన కీలక వ్యక్తుల్లో ఒకరు. పీకే స్ట్రాటజీలు చెబితే.. పక్కాగా అమలు చేసేవాడు రిషిరాజ్. అందుకే జగన్ కు ఈయనపై చాలా నమ్మకం ఏర్పడింది. ఎన్నికల తర్వాత ..సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత యూపీలో రిషిరాజ్ పెళ్లి జరిగితే ప్రత్యేక విమానంలో సతీసమేతంగా జగన్ వెళ్లారు. అంత నమ్మకం పెట్టుకున్న ఆయన… ఇప్పుడు పార్టీని పూర్తిగా చేతుల్లో పెట్టేశారు.
చిందరవందర చేస్తున్న రిషిరాజ్ !
రిషిరాజ్ ఐ ప్యాక్ సిబ్బందిని విస్తృతంగా నియమించుకున్నారు. అలాగే ఇంటలిజెన్స్ వ్యవస్థను పూర్తి స్థాయిలో వాడుకుంటున్నారు. ఇక నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటున్నారు. ఇటీవల స్టిక్కర్ల ఉద్యమం ఆయన ఆలోచనే. ఎలా ఎగ్జిక్యూట్ చేశారంటే.. చివరికి ఆ స్టిక్కర్లను కూడా తామే ప్రింట్ చేయించి పంపిణీ చేయించారు. స్టిక్కర్లు బ్యాగులు అన్నీ ఢిల్లీలోని తమ అనుబంధ సంస్థ పేరుతో తెప్పించారు. ఇక్కడ అసలు వైసీపీ నేతలకు.. సంబంధమే లేకుండా పోయింది. ఇంత మైక్రో లెవల్లో వైసీపీని రిషిరాజ్ డామినేట్ చేస్తూండటంతో.. సొంత పార్టీ నేతలు కూడా.. అసంతృప్తికి గురవుతున్నారు. ఇదేం పార్టీ అన్నట్లుగా ఉంటున్నారు.
ఇతర పార్టీల నేతలకు గాలం కూడా రిషిరాజే
విచిత్రంగా ఇతర పార్టీల నేతల్ని ఆకర్షించడానికి కూడా రిషిరాజే పెద్దగా వ్యవహరిస్తున్నారు. ఆయనే ఆయా నేతలకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. వైసీపీలో బలమైన నేతలు లేని చోట్ల… టీడీపీ నేతలకు ఆఫర్లు ఇస్తున్నారు. టిక్కెట్..ఖర్చు మొత్తం పెట్టుకుంటామని పార్టీలో చేరాలని రిషిరాజే మాట్లాడుతున్నారు. టీడీపీ నేతలు కూడా .. ఈయనెవరు.. ఇంత అతి చేస్తున్నారని అనుకునే పరిస్థితి వచ్చింది. ఇక వైసీపీ నేతలకు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చనే సెటైర్లు వినిపిస్తున్నాయి.