పొత్తు కోసం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ .. టీఆర్ఎస్ నేతలతో రాయబారం చేయిస్తోందంటూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టడానికి… టీఆర్ఎస్ కు వైసీపీ అవకాశం ఇవ్వడమే కాదు.. పొత్తుల విషయంలో మధ్యవర్తిత్వం చేయడానికి ఆ పార్టీని తీసుకురావడం… ప్రజల్లో చర్చనీయాంశమయింది. అందుకే వైసీపీ నేతలు కూడా… పవన్ చేసిన విమర్శలపై .. వెంటనే స్పందించారు. వైసీపీతో పొత్తు కోసం.. పవన్ కల్యాణ్ ను కలిసిన టీఆర్ఎస్ నేత ఎవరో తెలియ చేయాలని వైసీపీ నేత పార్ధసారథి డిమాండ్ చేశారు. అంతే కాదు.. పవన్ కల్యాణ్ కు వైసీపీతో పని చేయాలని ఉన్నట్లు ఉందని.. అందుకే అలా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు.
జనసేన, వైసీపీ మధ్య పొత్తు కుదర్చడానికి చాలా తీవ్ర స్థాయిలో.. ఢిల్లీ రేంజ్ లో ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి దూరమైనప్పటి నుంచి ఈ ప్రచారం ఉంది. మధ్యలో వారు… చాలా కాలం పాటు ఎలాంటి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోలేదు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో కానీ.. మళ్లీ విమర్శలు చేసుకోవడం ప్రారంభించారు. ఈ విమర్శలు వ్యక్తిగత రేంజ్ కి వెళ్లిపోయాయి. చివరికి.. ఇక పొత్తుల్లేనట్లే అన్న పరిస్థితి వచ్చే సరికి.. తెలంగాణ ఎన్నికలు పరిస్థితిని మార్చినట్లు కనిపిస్తున్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ.. జనసేన నేతలు కానీ.. తాము పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నట్లుగా ఎప్పుడూ చెప్పుకోవడం లేదు. ఇద్దరూ తాము 175 నియోజకవర్గాల్లోనూ పోటీచేస్తామని ప్రకటిస్తున్నారు. మళ్లీ ఈ రెండు పార్టీల వైపు నుంచే పొత్తుల ప్రకటనలు వస్తున్నాయి. తమతో కలవడానికి వైసీపీ రాయబారాలు చేస్తోందని జనసేన అంటూంటే… తమతో పోటీ చేయడానికి జనసేనకే ఆసక్తిగా ఉందని.. అందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి ఏపీ ప్రతిపక్ష పార్టీలు రెండింటికి… ఎన్నికల్లో కలసి పోటీ చేయాలా వద్దా అన్నదానిపై ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదని అర్థమవుతోంది.