ఏపీ సీఎం జగన్ రెడ్డి ఉదయం ఢిల్లీ వెళ్లి సాయంత్రం కల్లా ప్రధాని మోదీ, అమిత్ షాలతో మీటింగ్‌లు పూర్తి చేసుకుని చీకటి పడక ముందే తాడేపల్లికి చేరుకున్నారు. ఆ తర్వాత ఎప్పట్లాగే పాత ప్రెస్ నోట్ కొత్తగా విడుదలయింది. ప్రత్యేకహోదా దగ్గర నుంచి పోలవరం నిధుల వరకూ మెడలు వంచేందుకు జగన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారన్నట్లుగా అందులో ఉంది. ఈ అధికారిక ప్రకటనలో చెప్పేది లేపలేం జరగదని చాలా సార్లు కేంద్రమే చెప్పింది. మరి అంతర్గతంగా ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.
ఐదు రాష్ట్రాలతో పాటు ఎన్నికలకు వెళ్తారని లీకులు
సీఎం జగన్ ముందస్తుకు వెళ్లాలని అనుకుంటున్నారని జాతీయ మీడియాకు లీకులు ఇచ్చారు. ప్రధానితో ఇదే అంశంపై చర్చించారని వారు బ్రేకింగ్‌లు వేశారు. ఐదు రాష్ట్రాలతో పాటు ఆరో రాష్ట్రంగా ఏపీ ఎన్నికలు కూడా నిర్వహించాలని జగన్ కోరారని అంటున్నారు. అమిత్ షాతోనూ ఇదే అంశాన్ని చర్చించారంటున్నారు. దీనిపై ఆ ముఖ్య నేతల స్పందన మీ ఇష్టం అన్న రీతిలో వచ్చిందని.. జగన్ ఇక తదుపరి కార్యాచరణ సిద్ధం చేసుకుంటారని ఢిల్లీ స్థాయిలో ఓ అభిప్రాయం వినిపిస్తోంది.
కేంద్ర మంత్రివర్గంలో చేరుతారనీ ప్రచారం
అయితే బీజేపీ ఆశీస్సులు ఉండాలంటే ఖచ్చితంగా ఎన్డీఏలో చేరాలని జగన్ నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఎన్డీఏ బలోపేతం కోసం ఇప్పుడు మోదీ , షా ప్రయత్నిస్తున్నారు. కొత్త పార్టీలను చేర్చుకోవాలనుకుంటున్నారు. టీడీపీ రెడీగా ఉందని.. టీడీపీ ఎన్డీఏలో చేరితే సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతో వైసీపీనే చేరాలనే ఆలోచనలో జగన్ ఉన్నారని అంటున్నారు. వచ్చే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో వైసీపీకీ పదవులు ఉంటాయని భావిస్తున్నారు.
ఇంతకీ బీజేపీ స్పందన ఏమిటో ?
జగన్ ఢిల్లీ వెళ్లి తిరిగి వస్తున్నారు కానీ.. బీజేపీ నుంచి ప్రత్యేకమైన స్పందనలు మాత్రం.. వ్యక్తం కావడం లేదు. ఆయన చెప్పాలనుకున్నది చెప్పి వస్తున్నారని.. కానీ బీజేపీ పెద్దలు మాత్రం.. ఈ అంశాలపై ఆయనకు ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనే ముందస్తు ఎన్నికల అంశాన్ని ప్రస్తావించినా పట్టించుకోలేదని ఇప్పుడు మరోసారి దృష్టికి తీసుకెళ్లారని అంటున్నారు. జగన్ ముందస్తుకు వెళ్లాలనుకుంటే… కేంద్రం అడ్డుకునే అవకాశం లేదని భావిస్తున్నారు.