హైకోర్టు విభజనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అడ్డుపడుతున్నారని తెరాస నేతలు ఆరోపిస్తున్నారు. హైకోర్టు ద్వారా పరోక్షంగా తెలంగాణా రాష్ట్రంపై పెత్తనం చెలాయించడానికే ఆయన హైకోర్టు విభజనకి సహకరించడం లేదని తెరాస నేతలు ఆరోపిస్తున్నారు. వారికి చంద్రబాబు సమాధానం చెపుతూ, హైదరాబాద్ నే వదులుకొని వచ్చిన మేము హైకోర్టు కోసం ప్రాకులడుతామా? అని ఎదురు ప్రశ్నించారు. తెలంగాణా ప్రభుత్వం తనకి ముఖ్యమనుకొన్న సమస్యల గురించే మాట్లాడుతుందని, ఏపికి సమస్యలుగా ఉన్న షెడ్యూల్: 9,10 సంస్థల విభజన గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అన్ని సమస్యల గురించి మాట్లాడేందుకు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్దపడితే, హైకోర్టు విభజన గురించి మాట్లాడేందుకు నేను కూడా సిద్దంగా ఉన్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. దానిపై కెసిఆర్ ఇంతవరకు స్పందించలేదు.
ఈ అంశంపై ఇప్పుడు ఏపి వైకాపా నేతలు కూడా మాట్లాడటం మొదలుపెట్టడంతో తెదేపా వారికి కూడా సమాధానాలు చెప్పుకోవలసి వస్తోంది. వైకాపా సీనియర్ నేత ముఖ్యమంత్రి చంద్రబాబుకి కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుంచి పదేళ్ళపాటు రాష్ట్రాన్ని పరిపాలించుకొనే అవకాశం ఉన్నప్పటికీ, తాత్కాలిక సచివాలయం పూర్తిగా సిద్దం కాకపోయినా ఏపి ప్రభుత్వోద్యోగులందరిపై తీవ్ర ఒత్తిడి చేసి హడావుడిగా తరలించినప్పుడు, హైకోర్టు విభజనకి చంద్రబాబు నాయుడు ఎందుకు వెనుకాడుతున్నారు? హైదరాబాద్ లో పదేళ్ళ పాటు ఉమ్మడి హైకోర్టు ఉండవచ్చనుకొన్నపుడు సచివాలయం మాత్రం ఎందుకు ఉండకూడదు? అసలు హైకోర్టు విభజనకి చంద్రబాబు నాయుడు వెనకడటానికి కారణం ఏమిటి? అని ప్రశ్నించారు.
హైకోర్టు విభజనకి చంద్రబాబు నాయుడు ఎందుకు సహకరించడం లేదని తెరాస, వైకాపాల ప్రశ్నలకి చంద్రబాబు కానీ తెదేపా నేతలుగానీ నేరుగా సమాధానం చెప్పకపోవడం వలన తెరాస ఆరోపణలకి బలం చేకూర్చుతున్నట్లవుతుంది. ఇంకా అనేక అనుమానాలు, ఊహాగానాలకి అవకాశం కల్పించినట్లవుతుంది. తాజాగా వినిపిస్తున్న ఊహాగానం ఏమిటంటే హైకోర్టు విభజన జరిగితే జగన్ అక్రమాస్తుల కేసులన్నీ తెలంగాణా హైకోర్టుకి బదిలీ అయిపోతాయి. అందుకే చంద్రబాబు హైకోర్టు విభజన జరుగకుండా రాజధాని నిర్మాణంతో దానిని ముడిపెట్టారని మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవిధంగా చూస్తే అవి సహేతుకంగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
వచ్చే ఎన్నికలలో తెదేపాకి వైకాపా నుంచే గట్టి సవాలు ఎదుర్కోవలసి ఉంటుంది. గత ఎన్నికలలో త్రుటిలో విజయం చేజార్చుకొన్న జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికలు జీవన్మరణ సమస్య వంటివి కనుక ఎట్టిపరిస్థితులలో విజయం సాధించేందుకు చాలా గట్టిగా ప్రయత్నించడం తధ్యం. జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేసేందుకు తెదేపా వద్ద ఉన్న ఏకైక బలమైన ఆయుధం జగన్ అక్రమాస్తుల కేసులే. కనుక చేజేతులా ఆ ఆయుధాన్ని తెలంగాణా ప్రభుత్వానికి అప్పగించడం ఇష్టం లేకనే చంద్రబాబు నాయుడు వెనుకాడుతున్నరేమోననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవి నిజం కాదని తెదేపా భావిస్తున్నట్లయితే హైకోర్టు విభజనకి వెనుకాడనవసరం లేదు. ప్రస్తుతం ఈ సమస్య పతాకస్థాయికి చేరుకొంది కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిపై తన వైఖరిని స్పష్టం చేయవలసిన సమయం వచ్చినట్లే భావించవచ్చు.