పవన్ కల్యాణ్‌ను డీల్ చేయడంలో వైసీపీ రాజకీయం తేడాగా ఉంటోంది. తిట్టిస్తే చాలు అదే రాజకీయంగా కౌంటర్ ఇవ్వడం అనుకుంటోంది. అదీ కూడా పవన్ పై కుల ముద్ర వేసేందుకు సొంత పార్టీలోని కాపు నేతలతోనే తిట్టించడం రివాజుగా మారింది. ఇది ఆ సామాజికవర్గంలో ఒకరిపై ఒకరు తిట్టుకునేలా చేసి ఆనందించడానికి.. వారిలో వారినే శత్రువులుగా చేయడానికి తప్ప.. వైసీపీకి రాజకీయంగా ఉపయోగపడదన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ .. ఓట్లు చీలనివ్వబోమని చెబుతున్న ప్రతీ సారి.. పవన్ కల్యాణ్‌పై తిట్ల పురాణం వినిపించడానికి అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా , ధర్మశ్రీ వంటి వారు పరుగులు పెట్టి వస్తూంటారు. వారెవరూ.. పవన్ కల్యాణ్ లేవనెత్తిన అంశాలను ప్రస్తావించరు.
ప్రభుత్వ లోపాలను బయట పెడితే.. స్పందించరు. కానీ.. తమ పాలనలో అందరూ సుఖంగా ఉన్నారని చెప్పడానికి మాత్రం రెడీగా ఉంటారు. కానీ ప్రజల కష్టాల గురించి చెబితే మాత్రం స్పందించరు. కానీ పవన్ పై వ్యక్తిగత విమర్శలు తిట్లతో విరుచుకుపడటానికి రెడీగా ఉంటారు. అదే రాజకీయం అని వైసీపీ అనుకుంటోంది. పవన్ కల్యాణ్‌పై ఎటాక్ చేయడానికి కాపులనే జగన్ వాడుకుంటున్న తీరు ఆ సామాజికవర్గంలోనూ చర్చకు వస్తోంది. ఇంత దారుణంగా కుల రాజకీయాలు చేస్తున్నారని.. తమను పావులుగా పెట్టి జగన్ రాజకీయం చేస్తున్నారన్న అభిప్రాయం వారిలో బలపడుతోంది.
పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా ఎందుకు తిట్టాల్సి వస్తోందని.. రాజకీయంగా విభేదించవచ్చు కదా అని వస్తున్న ఫీడ్ బ్యాక్ ను వైసీపీ కూడా పట్టించుకోవడం లేదు. ఇది అంతిమంగా ఆ సామాజికవర్గంలో వైసీపీపై ద్వేషాన్ని పెంచుతోందని.. అనవసరంగా తమకు ఇతర కులాలతో శత్రుత్వాన్ని పెంచుతోందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. నిజానికి వైసీపీ చేస్తోంది ఈ రాజకీయమే. దీనిపై ఆ వర్గంలో అవగాహన పెరిగితే.. పవన్ విషయంలో .. కనీసం విధానాలపైనే విమర్శలు చేస్తారు. వ్యక్తిగతం జోలికెళ్లరు. కానీ వైసీపీలో కాపు నేతలకు .. ఏం మాట్లాడాలో కూడా పైనుంచే చెబుతారు. కాబట్టిచాయిస్ ఉండదు. జగన్ రెడ్డి రాజకీయంలో వారు పావులుగా ఉండాల్సిందేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.