కుక్కుల విద్యాసాగర్ ను డెహ్రాడూన్ లో అరెస్టు చేసి తీసుకు వచ్చిన పోలీసులు రిమాండ్ కు పంపారు. ఈ రిమాండ్ రిపోర్టులో ఓ అంశం కీలకంగా మారింది. ముందుగా ఊహించినట్లుగానే ముగ్గురు ఐపీఎస్ అధికారులు, సీఐ, ఎస్ఐ పేర్లు ఉన్నాయి. కానీ వారంతా ఈ తప్పుడు పని ఎందుకు చేశారు అంటే… వైసీపీ అత్యున్నత నాయకత్వం కోసం చేశారని రిమాండ్లో పేర్కొన్నారు. అంటే కుట్ర సీఎంవో నుంచే జరిగిందని నిరూపించబోతున్నారన్నమాట.
అసలు ఈ తప్పుడు కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న దగ్గర నుంచి కుక్కల విద్యాసాగర్ నుంచి వివరాలు రాబట్టే అవకాశం ఉంది. విద్యాసాగర్ ఇందులో ఓ పావు మాత్రమే. జెత్వానీతో ఆయనకు ఉన్న పరిచయం కారణంగానే తప్పుడు కేసు పెట్టడానికి ఓ టూల్ గా ఉపయోగపడ్డాడు. దానికి ఎంతో డబ్బులు తీసుకుని ఆయన అంగీకరించారు. మొత్తం బయటపడిన తర్వాత జెత్వానీ క్యారెక్టర్ పై నిందలు వేస్తూ… మీడియా ముందుకు వచ్చాడు. కానీ.. ఎవరికీ తెలియని చోట ఉన్నాడు. కేసు నమోదు తర్వాత పరారయ్యాడు.
అసలు ఈ కేసు మొత్తం సజ్జన్ జిందాల్ నుంచి ప్రారంభమవుతుందని… జగన్ తో ఆయన సమావేశంలోనే ఈ కేసు కు అంకురార్పణ జరిగిందని చెబుతున్నారు. తర్వాత దీన్ని సజ్జల ఎగ్జిక్యూట్ చేశారు. ఎవరికీ తెలియకుండా మాఫియా తరహాలో సెటిల్మెంట్ జరిగిపోవాలన్నారు . నెరన్నర పాటు వారిని వేధించినా ప్రభుత్వం మారే వరకూ బయటపడలేదంటే.. ఎంత పక్కాగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. ఇంకా విశేషం ఏమిటంటే.. కేవలం ఐదు లక్షల కేసులో… ఫేక్ ఫోర్జరీ డాక్యుమెంట్ తో ఓ కుటుంబం మొత్తాన్ని ఎలా జైల్లో పెట్టగలిగారు.. కోర్టుకు ఏం చెప్పారు.. వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేశారన్నది కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొత్తంగా ఇది చిన్న కేసు కాదని.. గత ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం ఎలా జరిగిందో ఓ ఉదాహరణకు నిలుస్తుందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.