ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నేతలంతా టీడీపీ, జనసేన గూటికి చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఆ స్థాయి నేతలపై ఈ రకమైన ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్థసారధి వైసీపీకి గుడ్ బై చెప్పారు. వసంత కృష్ణ ప్రసాద్ బిల్లుల కోసమే ఆగుతున్నారని అవి వచ్చాక తాడేపల్లి ప్యాలెస్ కు దండం పెడతారని అంటున్నారు కేశినేనిని పార్టీలో చేరకుండానే ఇంచార్జుగా ప్రకటించిన తర్వాత పరిస్థితి తీవ్రంగా మారింది. గత ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేసిన బొప్పన భవకుమార్ టీడీపీలో చేరనున్నారు. అందరు నేతల్ని కలిసి తన కోరిక చెప్పారు. వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మరో వైపు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది. వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరుతానని ఇప్పటికే ప్రకటించిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి సామినేని ఉదయభాను సన్నిహితుడు. బాలశౌరి .. పార్టీ మారాలని సామినేని ఉదయభానుపై ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉదయభాను జగన్ రెడ్డి తనకు అన్యాయం చేశారన్న భావనలో ఉన్నారు. తనకన్నా విధేయులు కాకపోయినా పేర్ని నాని , కొడాలి నాని, జోగి రమేష్లకు పదవులు ఇచ్చారని ఆయన ఫీలవుతున్నరాు.
వారు బూతులు మాట్లాడతారనే ఇచ్చారని..తాను అలా మాట్లాడనన్న కారణంగా పక్కన పెట్టారంటున్నారు. అయితే రాజకీయాల్లో ఇతర పార్టీలను.. అదీ సొంత సామాజికవర్గానికి చెందిన ముఖ్యులను తిట్టడం రాజకీయం అయితే.. తనకు అలాంటి విలువల్లేని రాజకీయం వద్దని ఆయన సైలెంట్ గా నే ఉన్నారు. ఇప్పుడు ఆయన జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే జగ్గయ్యపేట టీడీపీ సీటు కాబట్టి విజయవాడ వెస్ట్ ఇస్తామని జనసేన ఆఫర్ ఇస్తోంది. రెండు, మూడు రోజుల్లో ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.