వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. ఆ పార్టీ నాయకత్వ ఆలోచనలకు భిన్నమైన వాదన వినిపిస్తున్నాయి. స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా… రమేష్‌కుమారే ఉన్నారని.. రఘురామకృష్ణంరాజు మీడియాను పిలిచి మరీ చెప్పేశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ ఆయనే ఎస్ఈసీగా ఉంటారని.. ఒక వేళ ఏపీ సర్కార్ కాదంటే… కోర్టు ధిక్కార పిటిషన్లు పడేప్రమాదం ఉందని ఆయన చెబుతున్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వనందున.. గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్, జీవోలను రద్దు చేసినందున.. ఎస్ఈసీగా రమేష్‌కుమార్ పదవిలో ఉన్నట్లేనని చెబుతున్నారు.
తమ పార్టీ ప్రభుత్వం మాత్రం… భిన్నమైన అర్థాలు తీస్తూండటం.. రమేష్‌కుమార్‌ను మళ్లీ ఎస్ఈసీ పదవిలో ఉంచేందుకు సిద్ధపడకపోవతూండటం తప్పు అన్న రీతిలో ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. హైకోర్టు తీర్పు విషయంలో ఏపీ సర్కార్ చేస్తున్న వాదనలను ఆయన తోసి పుచ్చారు. తీర్పు మొత్తం సారాంశాన్ని తీసుకోవాలి కానీ.. ఒక్కో పదాన్ని విశ్లేషించుకుని సొంత అర్థాలు తీసుకుంటే కుదరదని ఆయనంటున్నారు. రమేష్‌కుమార్‌ను రాజ్యాంగంలోని 243కే అధికారం కింద నియమించారని.. జస్టిస్ కనగరాజ్‌ను పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నియమించారని గుర్తు చేశారు. అందుకని కనగరాజ్ నియామకం చెల్లకపోతే.. రమేష్ కుమార్ నియామకం చెల్లదని ప్రభుత్వం చేసే వాదనల్లో అర్థం లేదని రఘురామకృష్ణంరాజు అంటున్నారు.
రఘురామకృష్ణంరాజు అవసరం ఉన్నా లేకపోయినా…. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. నిజానికి ఎస్ఈసీ విషయంలో తమ పార్టీ.. ప్రభుత్వ అభిప్రాయం.. ఏమిటో ఆయనకు స్పష్టంగా తెలుసు. కానీ.. ఉద్దేశపూర్వకంగానే ఇలా స్పందిస్తున్నారన్న అభిప్రాయం వైసీపీలో వ్యక్తమవుతోంది.