అనంతపురం జిల్లా రాజకీయాల్లో కీలకమైన పరిణామం మరో రెండు రోజుల్లో చోటు చేసుకోనుంది. వైసీపికి చెందిన మాజీ ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి తెలుగుదేశంలో చేరనున్నారు. గత కొంతకాలంగా ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ రకరకాల స్థానిక కారణాల వల్ల ఆయన చేరిక వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపు ఖరారైనట్టు సమాచారం. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర అనంతపురంలో ప్రవేశించేలోగానే ఆయన్ను తెదేపాలో చేర్చుకోవాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారని, దీంతో గుర్నాధరెడ్డి ఈ నెల 30న తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారని సమాచారం.
ఈ పరిస్థితుల్లోనే… గుర్నాధరెడ్డి రాకను వ్యతిరేకిస్తున్న స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి గురువారం అమరావతి వచ్చి తమ అధినాయకుడు చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతపురంలో పార్టీ బలోపేతానికి గుర్నాధరెడ్డి చేరిక అవసరమని బాబు ఆయనకు నచ్చచెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ప్రభాకర్ చౌదరికే ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చి మరీ బుజ్జగించినట్టు తెలిసింది. అయితే రాజకీయాల్లో వ్యాపార ప్రయోజనాల కోసం మాత్రమే పార్టీలు మారే వారిని ఎలా తీసుకుంటారంటూ ప్రభాకర్ చౌదరి అధినేతను ప్రశ్నించినప్పటికీ అవన్నీ తాను చూసుకుంటానని, గుర్నాధరెడ్డితో నీకు ఏమీ ఇబ్బంది రాదు, ఆయన కూడా నీ నేతృత్వంలోనే పనిచేస్తాడని బాబు సముదాయించినట్టు సమాచారం. అంతేకాకుండా మిస్సమ్మ భూముల విషయంలో గుర్నాధరెడ్డి పాత్రను కూడా చంద్రబాబు దృష్టికి తెచ్చినప్పుడు… ఆ విషయంలో ప్రభుత్వ జోక్యం ఏమీ ఉండబోదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని బాబు ప్రభాకర్ చౌదరికి భరోసా ఇచ్చారని చెబుతున్నారు.
మొత్తం మీద బాబు చెప్పిన మాటలతో ప్రభాకర్ చౌదరి సంతృప్తి చెందారని, పార్టీ బలోపేతం కోసం తాను అంగీకరిస్తున్నట్టు బాబుకి తెలిపారని తేదేపా వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో గుర్నాధరెడ్డి రాకకు ఉన్న ఏకైక అడ్డంకి కూడా తొలగిపోయింది. కాబట్టి ఆయన చేరిక ఇక లాంఛనప్రాయమే అనుకోవచ్చు. అయితే గత కొంతకాలంగా పార్టీతో దూరంగా ఉంటున్న గుర్నాధరెడ్డి విషయంలో వైసీపీ కూడా మానసికంగా ఎప్పటి నుంచో సిద్ధంగా ఉంది కాబట్టి, ఆ పార్టీకి ఇది పెద్దగా షాక్ ఇచ్చే అంశమైతే కాదు.