వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసహనం.. రోజు రోజుకు పెరిగిపోతోంది. ఓ వైపు విజయసాయిరెడ్డి.. ఓ దిగువ శ్రేణి.. పార్టీ కార్యకర్త సోషల్ మీడియాలో ఎంత దారుణమైన భాష వాడుతారో.. అచ్చంగా.. అలాంటి మాటలనే.. ట్వీట్లు చేస్తూ… ఆయన “చదువుకున్న కుసంస్కారి” అని ఫిక్సయ్యే పరిస్థితికి వచ్చారు. ఇక ఆయనే అలా ఉంటే.. మిగతా నేతలు ఎందుకు .. సైలెంట్ గా ఉంటారు. ఆయన కంటే ఘనుడు ఆచంట మల్లన్న అని నిరూపించుకోవాలని తెగ తాపత్రయ పడుతున్నారు. చాలా మంది అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ… టీజేఆర్ సుధాకర్ బాబు అనే అధికార ప్రతినిధి మాత్రం.. పూర్తిగా కంట్రోల్ తప్పి పోయారు. టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మపై.. అత్యంత అసభ్యకరంగా మాట్లాడారు.
టీడీపీ అధికార ప్రతినిధిగా సాదినేని యామిని శర్మ.. ప్రతీ రోజు ప్రెస్ మీట్ పెడుతూంటారు. వైసీపీపై విమర్శల వర్షం కురిపిస్తూంటారు. నిజంగా… ఆమె విమర్శల్లో లాజిక్ ఉంటే.. ఎదురు దాడి చేయాలి. ఆమె వాదన కరెక్ట్ కాదని చెప్పాలి. రాజకీయంగా విమర్శలు చేయాలి. అది రాజకీయం అవుతుంది కానీ.. ఆమె టీడీపీ తరపున స్పందిస్తున్నారు కాబట్టి… “లోకేష్‌కు ఆమెకు ఏమి సంబంధం..?” అని ప్రశ్నిస్తే అది చౌకబారుతనం అవుతుంది. అదే చేశారు టీజేఆర్ సుధాకర్ బాబు. ఆయన ఎమ్మెల్యే అవ్వాలని ఆశ పడుతున్నారు. సంతనూతలపాడు అనే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయినా… ఓ మహిళా నేతకు.. కనీస గౌరవం ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేదు. సుధాకర్ బాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల… యామిని మానిసికంగా ఇబ్బంది పెట్టామని ఆనందపడతారేమో కానీ… ఈ సారి.. ఏ మహిళా నేత వైసీపీ తరపున గట్టిగా మాట్లాడినా… సుధాకర్ బాబు మాటలే గుర్తుకు వస్తే.. అది కచ్చితంగా సుధాకర్ బాబు తప్పే అవుతుంది. ఆ రకంగా… ఒక్క యామిని మానసిక స్థైర్యాన్ని కాదు.. వైసీపీలోని మహిళా నేతల మానసిక స్థైర్యాన్ని కూడా దెబ్బతీశారు సుధాకర్ బాబు. ఇప్పుడు రోజా, వాసిరెడ్డి పద్మ సహా.. అనేక మంది.. జగన్‌కు మద్దతుగా.. ప్రెస్మీట్లు పెడుతూంటారు. సుధాకర్ బాబు వల్ల వారిని ఇతరులు చూసే తీరు కూడా మారే పరిస్థితి ఏర్పడింది.
నిజానికి ఎన్నికల వేడి.. అనేక అనేక విమర్శలు చేసుకుంటారు. దానికి కౌంటర్లు వస్తూంటాయి. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. అయినా.. వైసీపీ .. టీడీపీ ఎందుకింత దాడికి తెగబడుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఓ వైపు గెలిచేస్తున్నామని.. సంబరాలు చేసుకుంటున్నారు. మరో వైపు.. ప్రతిపక్ష పాత్రకు… ఫిక్సయిపోతున్నామని.. ఇలాంటి విమర్శలు, చేతల ద్వారా నిరూపిస్తున్నారు. ఓ వైపు టీడీపీ… ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుని.. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్దమవుతూంటే.. వైసీపీ మాత్రం.. గెలిచేస్తున్నామని… సంబరాలు చేసుకుని.. టీడీపీని విమర్శించడమే పనిగా పెట్టుకుంది. వైసీపీలో అంతకంతకూ పెరిగిపోతున్న అసహనం… ఆ పార్టీలో అంతర్గతంగా గెలుపు ధీమా లేదనే విషయాన్ని స్పష్టం చేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.