సినీ నటి, వైసీపీ ఎంఎల్ఎ రోజా తెలుగుదేశం ప్రభుత్వంపైనా అందులోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైన తీవ్రంగా దాడి చేయడంలో పేరు సంపాదించారు. గతంలో శాసనసభ మొత్తం ఆమె చుట్టూనే తిరిగింది. అనుచితంఆ ప్రవర్తించారంటూ ఆమెను ఏడాది సస్పెండ్ చేశారు. కాని తనను తప్పుగా చూపించి అవతలి వారికి సంబంధించిన భాగాలు దాచేశారని రోజా అప్పుడూ ఇప్పుడూ ఆరోపిస్తూనే వున్నారు. ఏమైతేనేం- ఆమె కొంచెం నోటిదురుసుగానే మాట్లాడతారని దూకుడుగా వెళతారని అందరూ ఒప్పుకుంటారు. దాన్ని చూపించి ఆమెను,వైసీపీని బద్నాం చేయొచ్చని తెలుగుదేశం ఆలోచన అయితే అంతర్గతంగా అదే ఆమెకు ప్లస్ అయిపోయింది. గత కొన్ని వారాలుగా ప్రభుత్వంపై పాలకపక్షంపై దాడి చేసేందుకు రోజానే జగన్ నియోగిస్తున్నారు. తర్వాత తన భవిష్యత్తు ఏమిటనే సంకోచం లేకుండా రోజా అవతలివారిపై విరుచుకుపడుతుంటారు. ఏది అనుకుంటే అది అనుకూడనదని కూడా చూడకుండా అనేస్తుంటారు. తాజాగా ఎపి మంత్రివర్గం జగన్కు సంబంధించిన విడియో చూశారన్న వార్తపై స్పందిస్తూ అది మంత్రివర్గమా సినిమా థియేటరా అని ప్రశ్నించారు. ఇలా చెప్పాలంటే ఇంకా చాలా వున్నాయి. వీటివల్ల అనవసరంగా తాము ఇరకాటంలో పడుతున్నామని వైసీపీ నేతలు కొందరంటారు. కాని మరికొందరేమో అలా వుంటేగాని కుదరదని సమర్థిస్తున్నారు. కాకపోతే ఈ క్రమంలో ఒక వాదన మాత్రం ఆసక్తి రేకెత్తించింది. రోజాకు మరీ ఇంత ప్రచారమిస్తున్నారే మా పార్టీలో మరో సిఎం అభ్యర్థిని తయారు చేస్తున్నారా ? మాలో మాకు తగాదాలు పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారా అని వైసీపీ నేత ఒకరు సరదాగా ప్రశ్న వేశారట. గట్టిగా మాట్టాడుతుందని అవకాశాలివ్వడం వరకూ బాగానే వుంది గాని అతిగా భుజాన వేసుకుంటే ఎప్పుడైనా ఆమె పొరబాట్లకు కూడా పార్టీనే బాధ్యత వహించవలసి వుంటుందని మాత్రం ఆయన హెచ్చరించారు.