“రాజకీయం చేయమాకు..” ఈ మాట రాజకీయ నేత అంటే చాలా కామెడీగా ఉంటుంది. అసలు రాజకీయం చేసేవాళ్లే ఈ మాట అనడం… చూస్తూంటే.. అదంతా తప్పయినప్పుడు.. వీళ్లంతా ఎందుకు చేస్తూంటారనే ప్రశ్న.. సహజంగానే.. ఆ మాటను పడ్డవారికి అనిపిస్తుంది. వైసీపీ నేత పార్థసారధి.. శనివారం ఉద్యోగులను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇంతకీ వాళ్లేం చేశారంటే.. తమ సమస్యలపై వైసీపీ ఎందుకు అసెంబ్లీలో ప్రస్తావించదని.. ప్రశ్నించారు. అందులోనే మాజీ మంత్రి, వైసీపీ నేత పార్థసారధికి రాజకీయం కనిపించింది.
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని పాత పెన్షన్ విధానం కావాలంటూ.. కొద్ది రోజులుగా.. ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. శనివారం.. అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. విజయవాడలోనూ ఉపాధ్యాయ సంఘాలు ఓ సభ ఏర్పాటు చేసి.. కాంగ్రెస్, వైసీపీ నేతల్ని పిలిచారు.ఈ రెండు పార్టీలు.. తాము అధికారంలోకి రాగానే.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెబుతూ వస్తున్నాయి. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ తరపున పీసీసీ చీఫ్ రఘువీరా, వైసీపీ తరపున పార్థసారధి హాజరయ్యారు. సమావేశంలో … వైసీపీ అసెంబ్లీకి వెళ్లకుండా.. ఇక్కడకు వచ్చి… గెలిస్తే రద్దు చేస్తామని చెప్పడమేమిటని రఘువీరా ప్రశ్నించారు. దానికి ఉపాధ్యాయులు మద్దతు పలికారు. దాంతో.. పార్థసారధికి చిర్రెత్తుకొచ్చింది. రాజకీయాలు చేయవద్దంటూ.. ఉపాధ్యాయసంఘాల నేతలపై రుసరుసలాడారు.
అసలు పార్థసారధి.. అక్కడికి వచ్చింది రాజకీయం చేయడనికి..! అయినా సరే.. రాజీకయం చేస్తే గీస్తే తనే చేయాలనుకున్నారేమో కానీ.. ఉపాధ్యాయులు చేస్తే రాజకీయం తప్పులా అనిపించింది. తన పార్టీకి సంబంధించి.. లోపాల్ని ఎత్తి చూపి… తమ కోసం అసెంబ్లీకి వెళ్లి పోరాడమనడం.. ఆయనకు రుచించలేదు. అయిన దానికి.. కాని దానికి ప్రభుత్వంపై నిందలేసి.. ఎప్పటికప్పుడు కొత్త రాజకీయం చేసే పార్థసారథి.. ” రాజకీయం చేయమాకు” అని ఎదుటి వాళ్లను ఆగ్రహించడం.. కాస్త ఆసక్తి రేకెత్తించింది. ఒక్క పార్థసారధి మాత్రమే కాదు.. అన్ని పార్టీల నేతలూ అంతనేమో..? రాజకీయం అంటే..ఎదుటివారిపై తాము చేయాలనుకుంటారు కానీ.. తమపై ఎవరూ చేయకూడదనుకుంటారు.