వైయస్ వివేకానంద రెడ్డి హత్యోదంతాన్ని పూర్తిగా రాజకీయం చేస్తోంది వైకాపా. ఈ సందర్భంలో రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డిల మరణాలను ప్రముఖంగా ప్రస్థావిస్తున్నారు. ఇలాంటి సమయంలో వైకాపా నాయకురాలు రోజా ఎలా మాట్లాడతారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు! తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల్లో గెలిచేందుకు సిద్ధంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని మానసికంగా దెబ్బతియ్యాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు కుట్ర చేశారని ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారనీ, చంద్రబాబు చేసిన పాపాలన్నీ పండి జైలుకు వెళ్లబోతున్నారని రోజా జోస్యం చెప్పారు.
వైకాాపా అభ్యర్థులను జగన్మోహన్ రెడ్డి ప్రకటించాల్సి ఉందనీ, బీఫామ్స్ ఇవ్వాల్సి ఉందనీ, ఇవన్నీ పూర్తి చేసుకుని ప్రజల్లోకి పెద్ద ఎత్తున ప్రచారానికి వెళ్లాల్సి ఉందన్నారు రోజా. అందుకే, ఇలాంటి కీలక సమయంలో చిన్నాన్నని చంపి, మానసికంగా దెబ్బతీసి, ప్రచారంలో అభ్యర్థుల ఎంపికలో తత్తరపాటు పడేలా చేయాలన్నదే చంద్రబాబు కుట్ర అని రోజా ఆరోపించారు. దాంతో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. వివేకా హత్యపై దర్యాప్తునకు సీబీఐని ఎందుకు వేయడం లేదనీ, వారి ప్రమేయం లేకపోతే ఎందుకు భయపడుతున్నారని రోజా ప్రశ్నించారు. అధికారం కోసం ఎవరినైనా అడ్డు తొలగించుకోవడం చంద్రబాబుకి అలవాటనీ, అధికారం కోల్పోతారనే భయం చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోందన్నారు రోజా!
వివేకానంద రెడ్డి మరణం తరువాత రకరకాల కారణాలను వైకాపా నేతలే తెరమీదికి తెస్తున్నారు. కేసు దర్యాప్తు అయితే తప్ప వాస్తవాలేంటో ప్రజల ముందుకు రాని పరిస్థితి ఉన్నప్పుడు, సొంత పార్టీ నేతలే సంయమనంతో ఉండాలి. కానీ, ఎన్నికల ముందు జగన్ ఏకాగ్రతను దెబ్బతీయడం కోసమే వివేకానంద రెడ్డిని హత్య చేయించారనే వాదనను రోజా తెరమీదికి తెస్తున్నారు. ఇలా ఒక తీవ్రమైన ఆరోపణ చేసేముందు దీనికి సంబంధించిన ఒక్కటంటే ఒక్క ఆధారమైనా చూపించాలి కదా! వివేకా మరణం తరువాత బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నది ఆ పార్టీ నేతలే. ఓపక్క విచారణకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ… ఇంకోపక్క హత్యకి కారణాలు ఇవే అంటూ రోజా లాంటివారు రోజూ మీడియా ముందు మాట్లాడుతూ ప్రజలకు ఇస్తున్న సంకేతాలేంటి..? గడచిన రెండ్రోజులుగా వైకాపా నేతల తీరు గమనిస్తుంటే… ఎన్నికల ప్రిపరేషన్ అంతా ఈ హత్యోదంతం చుట్టూ ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.