ఏపీ వైసీపీ నేతలకు విచిత్రమైన అనుభవాలు ఎదురవుతూ ఉండటం సహజమే. అదీ కూడా జగన్ నుంచి. తాజాగా ఆయన వారసులకు ఈ సారి టిక్కెట్లు ఇచ్చేది లేదని ప్రకటించారు. కొంత మంది నేతలు ఇప్పటికే తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వారసుల్ని రంగంలోకి దింపుతున్నామని ప్రకటించారు. ఇలాంటి వారిలో డిప్యూటీ స్పీకర్ కోలగట్లతో పాటు పేర్ని నాని సహా సీమలోని పలువురు సీనియర్ నేతలు ఉన్నారు. వారందరికీ జగన్ చెప్పాల్సింది చెప్పారు.
పేర్ని నాని అయితే పూర్తిగా రిలాక్స్ అయిపోతూ ఇప్పుడు మచిలీపట్నానికి ఎమ్మెల్యే తన కుమారుడే అన్నట్లుగా ఆయనను తిప్పుతున్నారు. ఇటీవల కొడాలి నాని కూడా అదే ప్రకటించారు.వచ్చే ఎన్నికల్లో పేర్ని కిట్టు పోటీ చేస్తారని ప్రకటించారు. అప్పట్లో హైకమాండ్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి బాగోలేవని అనుకుంటున్నారేమో కానీ సీనియర్లు పోటీ చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. వారసులకు చాన్సిచ్చేది లేదంటున్నారు.
నిజానికి సీఎం జగనే ఓ పెద్ద వారసుడు. వారసత్వంతో వచ్చిన ఆయన.. ఇప్పుడు తమ వారసుల్ని రంగంలోకి తెస్తానంటే వద్దంటున్నారని నేతలు ఫీలవుతున్నారు. తనకు చాన్సి ఇవ్వాలన్నప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందించిందో.. తమ వారసులకు చాన్సివ్వాలని .. ఇప్పుడు సొంత పార్టీ నేతలు అడుగుతున్నప్పుడు… వైసీపీ హైకమాండ్ అలాగే స్పందిస్తోంది. అప్పటి స్పందనపై తీవ్ర నిరసన వ్యక్తం చేసి సొంత పార్టీ పెట్టుకున్నారు జగన్.. కానీ ఇక్కడ మాత్రం ఎవరూ నోరెత్తకుండా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు.