ఆర్టీసీ బస్సు చార్జీలు..విద్యుత్ చార్జీలు వగైరా పెంచినప్పుడు ప్రతిపక్షాలు రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలియజేయడం సర్వసాధారణమయిన విషయమే. అయితే అవే పార్టీలు అధికారంలోకి వచ్చినపుడు అవి కూడా చార్జీలు పెంచకమానవు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అందుకు నిరసనలు తెలియజేస్తుంటాయి. అంతా రొటీన్ డ్రామా ఇది. శుక్రవారం రాత్రి నుండి ఏపీఎస్ ఆర్టీసీ చార్జీలు భారీగా పెరిగాయి కనుక ప్రతిపక్షాలు కూడా షరా మామూలుగానే రోడ్లమీదకు వచ్చి హడావుడి చేస్తున్నాయి. ఈ చార్జీల పెంపుపై వైకాపా నేత తమ్మినేని సీతారామ్ భలే వితండ వాదన చేసారు.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హోదాఎటువంటి ప్రకటన చేయకపోవడంతో ప్రజల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అధికార తెదేపా ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్ళించడానికే నిన్న అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించిందని ఆరోపించారు. ప్రజల దృష్టిని మళ్లించాలంటే ఇంతకంటే మంచి ఉపాయాలు చాలానే ఉన్నాయి. కానీ అందుకోసం ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచిందని తమ్మినేని వాదించడం విడ్డూరంగా ఉంది. ఒక సమస్య నుండి తప్పించుకోవడానికి ఎవరయినా మరొక సమస్య ఎందుకు సృష్టించుకొంటారు? ప్రత్యేక హోదా సాధించనందుకే ప్రజలు ప్రభుత్వంపై మండిపడుతుంటే, మళ్ళీ ఆర్టీసీ చార్జీలు పెంచితే వారు ప్రభుత్వంపై మరింత ఆగ్రహిస్తారే తప్ప మెచ్చుకోరు కదా? ఈ సంగతి తమ్మినేనికి తెలియదనుకోలేము.
ఆయన మరో విచిత్రమయిన వాదన కూడా చేసారు. పెంచిన ఆర్టీసీ చార్జీల కారణంగా సామాన్య ప్రజలు ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పరిస్థితి ఉండదని, అప్పుడు ఆర్టీసీ మరింత నష్టాల్లో కూరుకొనిపోతే దానిని మెల్లగా దానిని ప్రైవేట్ పరం చేయడానికే చంద్రబాబు నాయుడు చార్జీలు పెంచుకొంటూ పోతున్నారని ఆయన వాదించారు. ఇప్పటికే తెదేపాకు చెందిన నేతలు అనేకమంది ప్రైవేట్ బస్సులు నడిపించుకొంటున్నారని వారికి లబ్ది కలిగించేందుకే ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచిందని ఆయన వాదించారు.
తెదేపాలో కేశినేని, దివాకర్ రెడ్డి వంటి వారు కొందరు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వ్యాపారంలో ఉన్నమాట వాస్తవమే. అయితే ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచినా, పెంచకపోయినా వారి సంస్థలు పరిస్థితులను బట్టి చార్జీలు పెంచుతూనే ఉంటాయి. అయినా టికెట్ చార్జీలు పెరిగాయని ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో, రైళ్ళలో, విమానాలలో ప్రయాణించడం మానేస్తే అవన్నీ ఎప్పుడో మూతపడి ఉండేవి. పెట్రోల్ ధర రూ.80కి చేరినా, ఉల్లిపాయల ధర రూ.100కి చేరినా, కందిపప్పు ధర రూ.200కి చేరినా, సినిమా టికెట్స్ ధరలు రూ.150 దాటిపోయినా ప్రజలు ఏదీ మానుకోలేదు. ఏదో విధంగా ఇబ్బందులు పడుతూ సర్దుకుపోతున్నారు. ఆర్టీసీ బస్సులు అంతే. రేపు ఒకవేళ వైకాపా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్లయితే ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచకుండా పరిపాలించగలదా? అంటే లేదనే చెప్పవచ్చును. తమ్మినేని వంటి రాజకీయ నేతలు తమ మాటకారితనంతో ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అధికారంలోకి వస్తే అందరూ చేసేది అదే పని. ఎవరూ ఎవరికీ తీసిపోరు. మధ్యలో నలిగిపోయేది సామాన్య ప్రజలే.