కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ తో సాంబ అనే సినిమా నిర్మించారు. ఎన్టీఆర్ కెరీర్ తొలినాళ్లలో ఎన్టీఆర్ కు సన్నిహితులుగా ఉండేవారు. ఇప్పుడు ఆయన పౌరసరఫరాల శాఖ మంత్రి అయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన ఒక నెల రెండు నెలల పాటు ఎప్పుడూ అభినందన సభ పాటలు జోరుగా జరుగుతూ ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు కూడా ఒక ఆత్మీయ అభినందన సభ జరిగింది. ఇందులో వక్తలు కొడాలి నాని ని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడారు. అందులో భాగంగా మరొక మంత్రి పేర్ని నాని , కొడాలి నాని ని ఆకాశానికి ఎత్తేస్తూ, అసలు జూనియర్ ఎన్టీఆర్ కి నటనలో ఓనమాలు నేర్పిందే కొడాలి నాని అన్నంతగా బిల్డప్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..
రవాణా శాఖ, సమాచార శాఖ మంత్రి అయిన పేర్ని నాని, ఈ అభినందన సభలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కొడాలి నాని సాటిలేని విజేత అని కొనియాడారు. ఈ కొడాలి నాని హరికృష్ణ శిష్యుడు అని, జూనియర్ ఎన్టీఆర్ ను నటుడిగా తీర్చిదిద్దడంలో ఈయన పాత్ర ఎంతో ఉందని పేర్ని నాని చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ నటుడిగా ప్రారంభ దశలో ఉన్నప్పుడు కొడాలి నాని ఆయనతో సన్నిహితంగా ఉన్న మాట వాస్తవమే కానీ, దగ్గరుండి జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ని నిర్మించింది కొడాలి నాని ఏ అన్నంతగా పేర్ని నాని బిల్డప్ ఇవ్వడం మాత్రం అనేక సందేహాలకు తావిస్తోంది. బహుశా మంత్రివర్యుల ను పొగుడుతూ పొగుడుతూ ఒకానొక టైంలో కంట్రోల్ తప్పిపోయి, అక్కడ సందర్భానికి ఏమాత్రం అవసరం లేని జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ తెచ్చారు ఏమో అని సభికులు అనుకున్నారు.
అయితే పేర్ని నాని ఒక్కరే కాదు, మిగతా వక్తలు కూడా తమ నాయకుని భజన లో ఏమాత్రం మొహమాట పడకుండా వ్యవహరించారు. మానవత్వం ఉన్న మహానాయకుడు, మహనీయుడు, సాటి లేని నిరంతర విజేత, ఇత్యాది పదాలన్నీ ఉపన్యాసాల మధ్యలో అలవోకగా దొర్లడం సభికులని ఆశ్చర్యానికి లోను చేసింది.