హైదరాబాద్ హోటల్లో సుజనా చౌదరితో సమావేశం అవడాన్ని వైసీపీ నేతలు ఓ కుట్రగా ప్రచారం చేస్తూ… ఎస్ఈసీ పదవికి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌ను వినిపిస్తున్నారు. అసలు.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీ కాదనే వాదనతో ఇప్పటి వరరూ వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా.. ఆయనను గుర్తించడానికి అంగీకరించడం లేదు. ఆయన నియామకం చెల్లదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే అనూహ్యంగా.. ఆయన ఎస్ఈసీనే అనే వాదనను ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నారు. ఆయన రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. ఇంతలో ఎంత మార్పు.. ఎలా సాధ్యమయిందంటే… కుట్ర సిద్ధాంతం వల్ల.
రమేష్‌కుమార్ .. సుజనా చౌదరితో సమావేశం అయింది తమకు వ్యతిరేకంగానే అన్న కోణాన్ని బలంగా చెప్పాలనుకుంటున్న వైసీపీ ఈ విషయంలో… తమ స్టాండ్‌కు భిన్నంగా ప్రకటనలు చేయడానికి కూడా సిద్ధమయింది. పలువురు మంత్రులు.. అంబటి రాంబాబు లాంటి నేతలు కూడా మీడియా ముందుకు వచ్చి.. ఎస్ఈసీ లాంటి హోదాలో ఉన్న వ్యక్తి.. బీజేపీకి చెందిన ఎంపీతో సమావేశం అవడం ఏమిటన్న కోణంలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ఎస్ఈసీగా విధులు నిర్వహించకుండా.. తామే అడ్డుకున్నామన్న విషయాన్ని అప్పటికప్పుడు మర్చిపోతున్నారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పార్క్ హయత్‌లో సుజనా చౌదరి కార్యాలయం ఉందని ఆయనే అధికారిక ప్రకటన చేశారు. అధికారికంగానే కలిశామని ప్రకటించారు. ఎస్ఈసీ ఏమీ క్రిమినల్ కాదు కాబట్టి.. కలవడంలో తప్పు ఏముందని సుజనా చౌదరి అంటున్నారు. అంతకు ముందు ఎస్ఈసీగా కనగరాజ్‌ను విజయసాయిరెడ్డి వెళ్లి కలిశారు. సుజనా చౌదరి, సీఎం రమేష్‌తో.. విజయసాయిరెడ్డి విందు భేటీ కూడా నిర్వహించారు. ఇలాంటి భేటీలు జరుగుతూనే ఉంటాయి. దాన్నేదో కుట్ర కోణంలో చెప్పి.. వైసీపీ.. ప్రచారం చేసే వ్యూహాన్ని ఎంచుకుంది. కానీ.. మౌలికంగా.. ఎస్ఈసీగా రమేష్ కుమార్ ఉన్నారన్న విషయాన్ని మాత్రం అంగీకరించేస్తున్నారు.