తెల్లారేసరికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వైకాపా నేతలకు నిరసనలకు దిగారు. ప్రముఖ పట్టణాల్లో బస్టాండుల్లో నేతలూ కార్యకర్తలూ భైఠాయింపులు మొదలయ్యాయి. ఇంకోపక్క పోలీసులు కూడా రంగంలోకి దిగారు! బంద్ లో పాల్గొంటున్న వైకాపా నేతలను అడ్డగిస్తున్నారు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. ముందుగా ముప్పాళ్ల స్టేషన్ కు తరలించారు, తరువాత రాజుపాలెం పీఎస్ కి మార్చారు. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిని కూడా ఇలానే స్టేషన్లు మార్చుతున్నారు. దీనిపై వైకాపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇది అమానుష చర్య అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో బంద్ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కార్యకర్తలూ పోలీసుల మధ్య కాస్త ఉద్రిక్తత నెలకొంది. ఉదయం ఐదు గంటల నుంచే నర్సాపురంలో బస్టాండు వద్ద వైకాపా నేతలు ధర్నాకి దిగితే, పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. విజయనగరం జిల్లాల్లోని బస్టాండుల వద్ద నిరసనలు తెలుపుతున్న నేతలు, కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. కొంతమంది నేతలూ కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేయడంతో నిరసనగా వెంకటగిరి, తిరుపతి రహదారులను వైకాపా వర్గాలు అడ్డగించాయి. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. కడపలో వైయస్ వివేకానంద రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇలా దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ ఉదయాన్నే బస్టాండ్లను టార్గెట్ గా పెట్టుకున్నారు వైకాపా నేతలు. సహజంగానే పోలీసులు రంగంలోకి దిగుతారు. అదుపులోకి తీసుకుంటారు. సాధారణ జన జీవనానికి ఇబ్బంది రాకుండా ఉండాలంటే బస్సులు తిరగాలి కదా. అయితే, బస్సులను అడ్డుకోవడం.. పోలీసులు నేతల్ని అదుపులోకి తీసుకుంటున్న నేపథ్యంలో వైకాపా నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తన అధికారంతో బంద్ ని అడ్డుకుంటున్నారంటూ వైకాపా నేతలు విమర్శలు మొదలుపెట్టారు.
నిజానికి, బంద్ కు ప్రజలంతా మద్దతు ఇస్తున్నారు అనుకున్నప్పుడు… బస్సులను అడ్డగించాల్సిన అవసరం ఏముంటుంది..? ప్రజలే బస్సులు ఎక్కేందుకు రారు కదా. స్వచ్ఛందంగా అందరూ వస్తున్నప్పుడు నిరసనల పేరుతో రహదారులను దిగ్బంధించాల్సిన పనేముంది..? ఏదేమైనా, బంద్ అనుకున్నట్టుగా జరిగితే… అది వైకాపా సాధించిన విజయం అంటారు. స్పందన సోసోగా ఉంటే… ఇది టీడీపీ దౌర్జన్యం అంటూ నేతల అరెస్టులనే భూతద్దంలో ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తారు. వాస్తవవానికి.. ఈ బంద్ ఎందుకు చేస్తున్నారనే సగటు ఆంధ్రుడి ప్రశ్నకు వైకాపా దగ్గర సమాధానం లేదు. ఢిల్లీ దాకా ఏపీ గళం వినిపించాలని జగన్ అంటున్నారు. మరి, మొన్నటి అవిశ్వాస తీర్మానంపై చర్చ, పార్లమెంటులో పోరాటం.. ఇదంతా ఢిల్లీలోనే జరిగింది కదా. ఇంకా వినిపించడానికి ఏముంది..? ఇదే అభిప్రాయం సామాన్యుల్లో ఉంది.