రైతులు చేస్తోంది ఉన్మాద యాత్ర అని వైసీపీ నేతలు అదే పనిగా హిస్టీరియా వచ్చినట్లుగా అరుస్తున్నారు. మొదట్లో అమరావతి నుంచి తిరుపతికిపాదయాత్ర చేసినప్పుడూ అంత కంటే ఎక్కువే అన్నారు. దాడులు చేస్తామన్నారు. చేశారు. ఎక్కడావారికి తిండి అందకుండా కుట్రలు కూడా చేశారు. చివరికి 70కిపైగా కేసులు కూడా పెట్టారు . ఇన్ని చేసినా రైతులు భరించారు. ఎక్కడా కంట్రోల్ తప్పకుండా తమ పాదయాత్ర పూర్తి చేశారు. భూములిచ్చిన పాపానికి రోడ్డున పడ్డ తమకు న్యాయం కోసం వారు పోరాడుతూంటే.. ఉన్మాదులంటున్నారు వైసీపీ నేతలు.
ముందుగా అమరావతినే రాజధాని అని ఊరూవాడా చెప్పి.. ఓట్లేయించుకుని చివరికి మూడు రాజధానుల పేరుతో రాజకీయ నాటకం ఆడి.. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ఏ మాత్రం సిగ్గుపడని పాలకులది మాత్రం … అసలైన రాజకీయం. అందులో ఉన్మాదమే లేదు. రైతులు పాదయాత్ర చేస్తే దాడులు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. ఏమైనా జరిగిదే బాధ్యత మాది కాదని కూడా హెచ్చరిస్తున్నారు. ఏమైనా జరిగితే అధికారంలో ఉన్న వారిదే బాధ్యత. ఆ విషయంలోనూ వారి తీరు ఉన్మాదంగానే ఉంది.
విశాఖలో రాజధాని పేరుతో గత మూడున్నరేళ్లుగా చేసిన.. చేస్తున్న దందాలు చూసి అక్కడి ప్రజలు విసిగిపోయారు. రాజధాని తో కొత్తగా వచ్చేదేమీ ఉండదని..విశాఖ ఇప్పటికే మెట్రో సిటీగా రూపాంతరం చెందిందని.. రాజధాని పేరుతో తమ ప్రశాంతంతకు భంగం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం విశాఖ వాసుల్లో ఉంది. వైసీపీ నేతల తప్ప.. ఏ ఒక్కరూ రాజధాని కోసం డిమాండ్ చేయడం లేదు. అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు కూడా అమరావతినే రాజధాని కావాలంటున్నాయి. కానీ ఇప్పుడు రైతులపై దాడులు చేస్తామని.. పాదయాత్ర వద్దని కొంత మంది హెచ్చరిస్తున్నారు. రైతుల్ని ఉన్మాదులంటున్నారు. నిజంగా ఉన్మాదులెవరు ?