కాపులకు రిజర్వేషన్లు కల్పించలేనంటూ చేతలెత్తేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారం.. రాజకీయ సమీకరణాలను మార్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. జగన్ పాదయాత్ర చేస్తున్న ప్రాంతాల్లో.. పలు చోట్ల కాపు యువకులు, మహిళలు ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు. దీంతో పరిస్థితి తీవ్రత అర్థమయిందో ఏమో కానీ.. వైఎస్ జగన్ ఉన్న పళంగా… పార్టీలో కొంత మంది కాపు నేతల్ని రంగంలోకి దింపారు. వారంతా హడావుడిగా ప్రెస్మీట్ పెట్టి.. జగన మాటల్ని వక్రీకరించారని ఒక్క మాటలో తేల్చేశారు. రిజర్వేషన్ల అంశాన్ని షెడ్యూల్ 9లో చంద్రబాబు పెట్టించలేకపోయారని.. ఆ విషయాన్ని మాత్రమే జగన్ వివరించారంటున్నారు. జగన్ వ్యాఖ్యల్లోని సారాంశాన్ని కాపులు అర్థం చేసుకున్నారని.. ఎవరెన్ని రాజకీయాలు చేసిన ప్రయోజనం ఉండదని తేల్చారు.
వైఎస్ జగన్మోహర్ రెడ్డి… సూటిగా.. సుత్తిలేకుండా… కాపు రిజర్వేషన్లు తన వల్ల కావని..ఇవ్వలేనని తేల్చేశారు. అంత స్పష్టమైన ప్రకటన ఉండి కూడా.. వక్రీకరించారని చెప్పుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందంటే… జగన్మోహన్ రెడ్డి తన వ్యాఖ్యలపై వెనుకడుగు వేసినట్లేనన్న భావన వ్యక్తమవుతోంది. పార్టీ విధానం అదే అయినప్పుడు… కొత్తగా.. కాపు నేతలందర్నీ రంగంలోకి దించి.. వక్రీకరణ అని చెప్పించడమెందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయంగా చేయగలిగిన దానిని కూడా జగన్… చేయలేనని చేతులెత్తేయడం వెనుక కారణాలేమిటన్నదానిపై కాపు సామాజికవర్గంలోనూ విస్తృత చర్చ జరుగుతోంది. కేంద్ర పరిధిలోని అంశమని తప్పించుకోవడం కూడా కన్విన్సింగ్ గా లేదు. కేంద్ర పరిధిలోని ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నట్లు చెప్పుకుంటున్నారు కదా అన్న అంశం తెర మీదకు వచ్చింది.
జగన్ ప్రకటన ఆధారంగా వైసీపీని మరింతగా కార్నర్ చేసేందుకు అధికార పార్టీ సిద్ధం అవుతోందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం.. రాష్ట్రంలోని సమస్యలు.. ముఖ్యంగా విభజన సమస్యలన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివేది. కేంద్రం చేయడం లేదని ప్రభుత్వం పోరాడుతోంది. కేంద్ర పరిధిలోని అంశాలపై తానేమీ చేయలేనని జగన్ చెప్పారని… ఆయనకు ఓటు వేసినా ఏం ప్రయోజనం ఉంటుందని.. తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. కాపు రిజర్వేషన్లు కేంద్రం పరిధిలోని అంశమని ప్రకటించి… జగన్ తెలివిగా తప్పించుకున్నారనుకున్నారు కానీ… మొత్తానికే అడ్డంగా దొరికిపోయినట్లయింది పరిస్థితి. అందుకే వీలైనంత డ్యామేజ్ తగ్గించుకోవడానికి వక్రీకరణ అంటూ ప్రకటనలు చేస్తున్నారు.