వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ నేతల్ని చేర్చుకోవడానికి ప్రత్యేకంగా ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తున్నారు కానీ.. దాని వల్ల తన పార్టీకి వస్తున్న సైడ్ ఎపెక్టులను తగ్గించేందుకు మాత్రం సరైన ప్రయత్నాలు చేయలేకపోతున్నారు. చీరాల నుంచి.. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను చేర్చుకున్నామని… విజయదరహాసం చేసేలోపునే.. ఆ పార్టీకి తొమ్మిదేళ్లుగా..చీరాల ఇన్చార్జ్గా ఉన్న యడం బాలాజీ … చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఎన్నారైగా ఉన్న యడం బాలాజీని.. రాజకీయాలు ఆశ చూపి.. వైసీపీ నేతలే… తొమ్మిదేళ్ల కిందట స్వదేశానికి వచ్చేలా చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ఆయన పార్టీ కార్యక్రమాలను సొంత ఖర్చుతో చేపడుతున్నారు. తీరా ఇప్పుడు ఎన్నికలకు ముందు.. ఆయనకు షాక్ ఇవ్వడంతో… కరిగిపోయిన సంపదను చూసి కన్నీరు పెట్టుకున్నారు. జగన్.. కనీసం ఓదార్పు మాటలు కూడా మాట్లాడకపోవడంతో.. టీడీపీవైపు చూస్తున్నారు.
ఒక్క చీరాల నియోజకవర్గం మాత్రమే కాదు.. ఇంత కాలం పార్టీ కార్యకలాపాల్లో పాల్గొని ఇప్పుడు నిరాదరణకు గురవుతున్న చాలా మంది సమన్వయకర్తల పరిస్థితి అంతే ఉంది. ఆ మూల ఉన్న హిందూపురం నుంచి…ఈ మూల ఉన్న భీమిలి వరకు.. కనీసం యాభై నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు.. రగిలిపోతున్నారు. హిందూపురంలో.. ఈ సారి బాలకృష్ణను ఓడించి తీరుతానని సవాల్ చేసిన.. నవీన్ నిశ్చల్ చివరికి.. జగన్ టిక్కెట్ లేదని తేల్చి చెప్పడంతో… టీడీపీలోకి వెళ్తే ఎలా ఉంటుందా .. అని సన్నిహితులతో సమాలోచనలు చేస్తున్నారు. భీమిలీలో.. కర్రి సీతారం.. అనే సమన్వయకర్త గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కూడా టీడీపీలో చేరుతారని చెబుతున్నారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు.. చాలా మంది సమన్వయకర్తలు.. ఇప్పుడు…తమను టిక్కెట్ విషయంలో పరిగణనలోకి తీసుకోవడం లేదని టెన్షన్ పడుతున్నారు. చాలా మంది రగిలిపోతున్నారు కూడా.
ఒక్క గుంటూరు జిల్లాలోనే ఆరుగురు సమన్వయకర్తల్ని జగన్ దూరం పెట్టారు. అత్యంత విధేయుడిగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి నుంచి… పెదకూరపాడులో ఓ రియల్టర్ దొరికే వరకూ… పార్టీ వ్యవహారాలు చూసుకున్న కావటి మనోహర్ నాయుడి వరకు ఈ జాబితాలో ఉన్నారు. చిలుకలూరిపేటలో సీనియర్ నేత మర్రి రాజశేఖర్ పరిస్థితి దారుణంగా ఉంది. వీరికి కొత్తగా పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తలు తోడుగా వస్తున్నారు. టీడీపీ నుంచి ఎవరు వచ్చినా చేర్చుకునేందుకు జగన్ సిద్ధమవడంతో.. ఈ జాబితా పెరగనుంది. ఇలా అసంతృప్తికి గురయ్యేవారిని జగన్ పట్టించుకునే అవకాశాలు కనిపించడం లేదు కాబట్టి.. వారంతా.. టిక్కెట్ వచ్చినా రాకపోయినా.. ఇతర పార్టీల్లో చేరిపోవాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారు.