నంద్యాల ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన తీరుకు గాను వైసీపీ ఎంఎల్ఎ సినీనటి రోజాకు నాయకత్వం తీవ్రంగా అక్షింతలు వేసినట్టు వచ్చిన కథనాలు నిజం కాదని ఆ పార్టీ మాజీ మంత్రి ఒకరు చెప్పారు. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో కమిటీని వేసి ఆమెను పిలిపించడం మాట్లాడ్డం అంతా కట్టుకథేనని ఆయన అంటున్నారు.రోజా మాట్లాడిన ఒకటి రెండు మాటలు బాగా లేవనే భావన వచ్చిన మాట నిజమే గాని ఆమెను అభిశంసించడం గాని తక్కువ చేయడం గాని జరగలేదని స్పష్టం చేశారు. ఇక ముందు కూడా అలా జరగబోదన్నారు. రోజా సభలకు ఇప్పటికీ జనం ఎలా వస్తున్నారో చూడాల్సిందిగా ఆయన కోరారు.
రోజా మాటల వల్ల ఓట్లు పోవడం నిజమైతే జగన్ మాటల వల్ల కూడా చాలా ఓట్లు పోయివుంటాయి కదా అని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. ఆ సమయంలో అక్కడే వున్న మరో వైసీపీ సన్నిహితుడు కూడా రోజానే బలపర్చడం విశేషం. రోజాను నిజంగా తగ్గించేస్తే ఆమెపై పోటీకి వాణీ విశ్వనాథ్‌ను తెలుగుదేశం ఎందుకు ముందుకుతెస్తున్నట్టు అని ఒక నాయకుడు ప్రశ్నించారు. వైసీపీ తీరుతెన్నులు జగన్ వ్యవహార సరళి మారవలసి వుందంటూనే ప్రధానంగా పాలక పక్షం వైఫల్యాలే మాకు కలసి వస్తాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉప ఎన్నికలు ఎప్పుడూ పాలకపక్షాలకు వెళ్లడం సహజమేనని అయితే చాలా పార్టీలు ఉప ఎన్నికల్లో గెలిచి అసలు ఎన్నికల్లో మట్టి గరచాయని కూడా వైసీపీ వాదనగా వుంది. ఏది ఏమైనా వ్యక్తుల పరంగానూ విధానాల పరంగానూ వైసీపీలో పెద్ద మార్పులు వచ్చే అవకాశమైతే కనిపించడం లేదు. టిడిపి వైఫల్యాలపైనే వారు ఆశపెట్టుకుని కూచున్నారు. ఇంతకంటే చురుగ్గా పనిచేయించడానికి, కార్యక్రమాలు చేపట్టడానికి ముందు అద్యక్షుడే సిద్ధంగా లేరట. ఇప్పుడే పూర్తి వేగం పెంచితే ఎన్నికల వరకూ నడిపించడం కస్టమన్నది అగ్రనాయకుల అవగాహనగా వుంది. పైకి ఏమి చెప్పినా బిజెపితో చెలిమిపైనా వైసీపీలో ఇంకా ఆశలున్నాయి.