ఐదేళ్ల పాటు ఇష్టారీతిన దోచుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు ఓట్ల కొనుగోలుకు ముందే చిల్లర విసురుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు డబ్బుల పంపిణీ, కానుకల పంపిణీ ప్రారంభించారు. దాదాపుగా ప్రతీ నియోజకవర్గంలోనూ పంపిణీ జరుగుతోంది. టిక్కెట్లపై క్లారిటీ లేని చోట మాత్రమే పంపిణీ జరగడం లేదు. మిగిలిన చోట్ల .. అభ్యర్థులు స్వయంగా రంగంలోకి.. ప్రత్యేకంగా టీముల్ని ఏర్పాటు చేసి.. ఇంటింటికి కానుకలు పంపిణీ చేస్తున్నారు.
చీరలు, వాచీలు, ప్యాంట్ షర్టులు, కుక్కర్లు ఇలా లెక్కలేని విధంగా పంపిణ జరుగుతోంది. ఇప్పటికే వాలంటీర్లకు..సచివాలయ సిబ్బందికి పెద్ద ఎత్తున కానుకలు ఇచ్చారు. ఇప్పుడు ఓటర్ల వరకూ వెళ్తున్నారు. ఇందు కోసం నియోజకవర్గానికి పది కోట్ల వరకూ ఖర్చు పెడుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే వైసీపీలో ఉండి వారు సంపాదించిన దానితో పోలిస్తే ఇది అసలు పెద్ద మొత్తమే కాదన్న వాదన వినిపిస్తోంది. ఇష్టారీతిన దోచుకుని ఇప్పుడు.. చిల్లర పంచి మళ్లీ ఓట్లు పొందాలనుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
ఈ పంపిణీని స్వయంగా వైసీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచే మానిటరింగ్ చేస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఎంత మందికి పంపిణీ చేశారో రిపోర్టులు .. అభ్యర్థులు.. ఇంచార్జులు ..సెంట్రల్ ఆఫీసుకు పంపాలని ఆదేశించారు. ఎవరైనా పంచకపోతే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ వ్యవహారం అంతా హైకమాండ్ కనుసన్నల్లోనే సాగుతోంది. ప్రజల్ని ఓట్లు అమ్ముకునేవారిగా భావించి.. రాజకీయ వ్యాపారం చేస్తున్నట్లుగా వైసీపీ నేతల తీరు ఉంది.