ఉత్తరాంధ్రలో వైసీపీ సీనియర్లకు సెగ తగులుతోంది. కింది స్థాయి నేతలు … రాజీనామాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నంత కాలం తమను పట్టించుకోలేదని.. ఇప్పుడు వారికే టిక్కెట్లు కేటాయించడం ఏమిటని గుడ్ బై చెబుతున్నారు. గాజువాకలో గుడివాడ అమర్నాథ్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, తాజా మాజీ ఇంచార్జ్ ఉరుకూటి చందు పని చేయడం లేదు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ను కార్పొరేటర్లు అందరూ వ్యతిరేకిస్తున్నారు.
ఆముదాలవలస నియోజకవర్గంలో స్పీకర్ తమ్మినేని సీతారాం అభ్యర్థిత్వాన్ని నిరసిస్తూ పొందూరుకు చెందిన సీనియర్ నేత సువ్వారి గాంధీ రాజీనామా చేశారు. పలాస నియోజకవర్గంలో మంత్రి సిదిరి అప్పలరాజు అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గంలోని కీలక నేత దువ్వాడ శ్రీకాంత్ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే అప్పలరాజును వ్యతిరేకిస్తూ సీనియర్ నేత హేమ బాబు చౌదరి పార్టీని వీడారు. ఇచ్చాపురంలో విజయ, టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్, పాతపట్నంలో రెడ్డి శాంతి అభ్యర్థిత్వాలను వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు రచ్చకెక్కుతున్నారు.
విజయనగరంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రరావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం వైసీపీ నేత అవనాపు విజయ్ నిరసన ర్యాలీ చేసి పార్టీ నుంచి వైదొలగారు. వైసీపీ సీనియర్ నేత కాళ్ల గౌరీ శంకర్ తాజాగా కోలగట్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్ కోట నియోజకవర్గంలో కూడా అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. ఎమ్మెల్సీ రఘురాజు వర్గం పార్టీ వీడిపోయింది. నియోజకవర్గాల అసంతృప్తి పంచాయితీలు అధిష్టానం దృష్టికి చేరడంతో వీటిని సరి చేసేందుకు ముఖ్య నేతలను పంపింది. కానీ అత్యధిక మంది నేతలు మీకో దండం అంటున్నారు.