పోలీసులు నోటీసులు ఇస్తే వణికిపోతారు. సిట్ అధికారులు నోటీసులు ఇస్తే మరింత పవర్ ఫుల్. ఆ నోటీసుల ప్రకారం విచారణకు హాజరు కాకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఒక్కరంటే ఒక్కరైనా రెటమతం సమాధానాలు చెబితే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయన్న భయం ఉంటుంది. అయితే ఏపీలో వైసీపీ నేతలకు మాత్రం కాదు. చట్టాలు వారికి చుట్టాలు. పోలీసులు ,సిట్ అధికారులు ఇచ్చే నోటీసులు బేఖాతర్ చేసి ఇష్టారాజ్యంగా తిరుగుతూంటారు. ఇక్కడ అసలు ట్విస్టేమిటంటే ఆ దర్యాప్తు సంస్థలు కూడా .. కఠినంగా వ్యవహరించడానికి అసలు ఇష్టపడటం లేదు. వారంతా మనకి తెలిసినోళ్లే కదా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఒక్కరంటే ఒక్కరు కూడా పోలీసుల నోటీసుల్ని సీరియస్గా తీసుకోలేదు!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నేరాలపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో చాలా మమందిని విచారణకు పిలుస్తూ నోటీసులు జారీ చేస్తున్నారు. కానీ పోలీసుల నోటీసుల్ని అందుకని వాటిని గౌరవించిన వారు ఒక్కరూ లేరు. వారేదో పనీ పాటా లేకుండా పిలుస్తున్నట్లుగా.. తమకు ముందుగా నిర్ణయించిన పనులు ఉన్నాయని తాము .. మీరు చెప్పిన తేదీల్లో రాలేమని పెడసరంగా సమాధానం ఇస్తున్నారు. మీరు పిలిస్తే మేము వచ్చేదేంటి అంటున్నారు. విజయ్ కుమార్ రెడ్డి అనే అధికారి దగ్గర నుంచి పెద్దిరెడ్డి అనే మాజీ మంత్రి వరకూ ఇదే వరుస. ఇప్పటి వరకూ ఒక్క వైసీపీ నేత కూడా నోటీసుల్ని సీరియస్ గా తీసుకుని పోలీసుల ముందు,సిట్ ముందు హాజరు కాలేదు.
వైసీపీ నేతలకు ఇంత అలుసెలా ఇస్తారు ?
వారంతా అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారు. బహిరంగంగా సాక్ష్యాలు ఉన్నాయి. ప్రజల ముందు ఉన్న అనే కేసుల్లోనే సాక్ష్యాలు బహిరంగంగా ఉన్నాయి. ఇక ప్రభుత్వ రికార్డుల్లో ఎంత బలమైన సాక్ష్యాలు ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. అయినా పోలీసులు వారికి నోటీసులు జారీ చేసి.. లైట్ తీసుకుంటున్నారు. వారు తమకు వ్యక్తిగత పనులు ఉన్నాయని రాలేమని చెప్పినా పట్టించుకోవడంలేదు. చివరికి రాజ్ కసిరెడ్డి అనే ఘరానా దోపిడీ దారు..ఎదురు ప్రశ్నిస్తూ ఈ మెయిల్స్ పంపుతున్నాడు. తేడా వచ్చే సరికి పారిపోయాడు. ఇప్పుడు అతని కోసం యాభై మందికిపైగా వేట సాగించాల్సి వస్తోంది. నిజానికి అతను ఎక్కడ ఉన్నాడో పోలీసులకు తెలుసు. కావాలనే పట్టుకోవడం లేదని ఎక్కువ మంది భావన. అందులో 90 శాతం నిజం ఉంటుంది.
వ్యవస్థ పవర్ ఫుల్ – నడిపించేవారి చేతకానితనం !
చట్టం చేతులు చాలా పొడుగైనవి. కేసులు సాల్వ్ చేయాలన్నా.. నిందితుల్ని అరెస్టు చేయాలన్నా.. పెద్దగా సమయం పట్టదు. కానీ ఏపీలో గతంలో అధారాల్లేని కేసుల్లోనూ జైలుకు పంపితే.. ఇప్పుడు ఆధారాలున్న కేసుల్లోనూ చర్యలు తీసుకోలేని నిమిత్తమాత్రంగా మారుతున్నారు. చట్టాలు, న్యాయాలు, రాజ్యాంగ హక్కుల ప్రకారం అందరికీ అవకాశాలు కల్పిస్తూ మెల్లగా దర్యాప్తు చేసుకుంటూ పోతే.. ఎప్పటికి అక్రమార్కులు బయటకు వస్తారు ?. కింది కోర్టులో.. పై కోర్టులో.. ఆపై కోర్టులోనూ పిటిషన్లు వేసుకుని వాదించుకునేంత సమయం ఎందుకిస్తున్నారు?. ఎక్కడా ఊరట లభించకపోయినా ఎందుకు అరెస్టు చేయడంలేదు ?. వ్యవస్థ పవర్ ఫుల్ గా ఉన్నా.. నడిపించేవారి చేతకానితనం ఇందులో కనిపించడం లేదా?