వైసీపీలో ప్రస్తుతం ఓ చర్చ అంతర్గతంగా విస్తృతంగా జరుగుతోంది. పార్టీ హైకమాండ్కూ దీనిపై స్పష్టమైన సమాచారం ఉందని అంటున్నారు. అది బీజేపీతో టచ్లో ఉన్న ఎమ్మెల్యేల విషయం. ఇటీవల కేసీఆర్… ఎమ్మెల్యేల కొనుగోలు ముఠాను పట్టుకున్నారు. ఆ ముఠా 70 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో టచ్లోకి వెళ్లినట్లుగా బయట పెట్టింది. అయితే అది మాటలేనా లేకపోతే అంతకు మించిన ఆధారాలున్నాయా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ.. బీజేపీ ఏపీలో కూడా ఆపరేషన్ చేస్తోందని.. అదీ వైసీపీపైనే అనేదానిపై మాత్రం.. ఓ క్లారిటీ వచ్చింది. కానీ ఇప్పటికిప్పుడు బీజేపీపై పోరాడేంత సీన్ లేదు. ఎం చేసినా.. సార్ సార్ అంటూ ఉండాల్సిందే. అదే చేస్తున్నారు.
అయితే అంతర్గతంగా మాత్రం టీఆర్ఎస్ చీఫ్ నుంచి వచ్చిన సమాచారంపై విశ్లేషణ జరుగుతోంది. తమను కాదని బీజేపీతో టచ్లో ఎవరు ఉన్నారు… అసలు ప్లానేంటి అన్నదానిపై డీకోడింగ్ ప్రారంభించారు. తెలంగాణలో కల్వకుంట్ల కవితను షిండేగా చేయాలనుకున్నారు. మరి ఏపీలో ఆ పాత్రను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారన్నదానిపై క్లారిటీ లేకుండా పోయింది. జగన్ కుటుంబసభ్యుల్లోనే ఒకరు ఉంటారని ఎమ్మెల్యేలు అనుకుంటూండగా.. మరికొందరు మాత్రం.. సీనియర్ నేతల్లో ఒకరిని లైన్లో పెట్టారని చర్చించుకుంటున్నారు.
గతంలో బీజేపీ అనుకూల చానళ్లలో కూడా వైసీపీలో తిరుగుబాటు వార్తలు వచ్చాయి. అవి ఊరకనే వచ్చి ఉంటాయని ఎవరూ అనుకోవడం లేదు. అంతర్గతంగా ఏదో జరుగుతోందన్న అనుమానం మాత్రం చాలాకాలంగా ఉంది. అదేమిటో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందంని చెబుతున్నారు. ముందు జాగ్రత్తగా వైసీపీ పెద్దలు .. కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంతమందిని దూరం పెడుతున్నారు. ఎమ్మెల్యేల జాబితాను .. పక్కన పెట్టుకుని ఎవరెవర్ని దూరం ఉంచాలో డిసైడ్ చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలపై జగన్ ఆగ్రహానికి ఇది కూడా ఓ కారణం అని అంటున్నారు.