రిపబ్లిక్ సినిమా ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమాల టికెట్ లను ప్రభుత్వం తమ చేతుల్లో కి తీసుకోవడం పై చేసిన విమర్శలు అటు సినిమా వర్గాల నుండి ఇటు రాజకీయ వర్గాల వరకు ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. పవన్ స్పీచ్ తర్వాత రెండు రోజుల పాటు వైఎస్ఆర్సిపి మంత్రులు కార్యకర్తలు నేతలు వరుస బెట్టి పవన్ పై ముప్పేట దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా పరిణామాలను బట్టి చూస్తూ ఉంటే వైఎస్ఆర్ సీపీ కి చెందిన మంత్రులు పవన్ ట్రాప్ లో సులువు గా పడ్డారని అర్థమవుతోంది. వివరాల్లోకి వెళితే ..
పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ల గురించి ప్రభుత్వాన్ని నిలదీయగానే ప్రభుత్వం దానికి గట్టిగా కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నించింది. ముందుగా ఫిలిం ఛాంబర్ కి సంబంధించిన వ్యక్తుల తో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని, దీని తో ఇండస్ట్రీకి సంబంధం లేదని ఒక లెటర్ ఇచ్చేలా చేసింది. ఇక ఇండస్ట్రీ నుండి కొందరు వ్యక్తులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ను ఇండస్ట్రీ ఏకాభిప్రాయం గా పరిగణించ లేము అని చెప్పేలా చేసింది. వైఎస్ఆర్సిపి మంత్రుల తో సినీ పరిశ్రమ మేలు కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని ప్రకటింప చేసింది. ఇదంతా బానే వుంది కానీ ఇక్కడే వైఎస్ఆర్సీపీ మంత్రులు పవన్ కళ్యాణ్ ట్రాప్ లో గుడ్డి గా దబ్బున పడ్డారనే చర్చ తాజాగా వినిపిస్తోంది.
అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ మంగళ గిరి లో ఒక మీటింగ్ పెట్టి, మీ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఎందుకు నత్త నడక న సాగుతోంది అని జగన్ ని పేరు గా ప్రశ్నించారు. మరి ఇప్పుడు వైకాపా మంత్రులు వచ్చి దీనికి సమాధానం ఇవ్వగలరా? కోడి కత్తి కేసు ఏమైంది అని పవన్ ప్రభుత్వాన్ని అడిగారు. అదే విధంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాం లో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి అని, ప్రజల మీద అన్ని పన్నులు వేసి లక్ష కోట్ల కు పైగా ఆదాయం ఆర్జిస్తున్న ప్రభుత్వం కనీసం ఊళ్ళ లో రోడ్డు ఎందుకు వేయలేక పోతోంది అని ప్రశ్నించారు. మరి దీని పై వైయస్ఆర్సిపి మంత్రులు నిన్న లా అంతే దీటు గా సమాధానం ఇవ్వ గలరా? లేదంటే సినీ పరిశ్రమ వ్యక్తుల తో తమ మేలు కోసమే ప్రభుత్వం టికెట్లు పోర్టల్ ద్వారా అమ్మే నిర్ణయం తీసుకుందని చెప్పించిన రీతి లో, ప్రజల తో కూడా తమ మేలు కోసమే ప్రభుత్వం రోడ్లు వేయడం లేదు అని చెప్పిస్తారా ? ఉద్యోగుల కు సకాలం లో జీతాలు ఇవ్వడం లో ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని పవన్ కళ్యాణ్ ఈ రోజు తాజా స్పీచ్ లో వ్యాఖ్యానించారు. ప్రతి నెల మూడవ వారం దాటితే కానీ పెన్షన్లు రావడం లేదని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. మరి ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ మంత్రులు వచ్చి పెన్షన్లు లేట్ కావడం పై , జీతాలు సకాలం లో వేయలేక పోవడం పై అదే దూకుడు తో సమాధానం ఇవ్వగలరా ? ప్రజల కోసమే ప్రెసిడెంట్ మెడల్ లాంటి మద్యం బ్రాండ్ లు ప్రభుత్వం ప్రవేశ పెట్టింది అని ఆ ప్రజల తోనే చెప్పించగలరా? ఇంకా రేపటి నుండి, సీపీఎస్, ధర ల పెరుగుదల, మద్యం, ఇసుక, విద్యుత్ ఛార్జీ లు, ఇలా పవన్ లేవనెత్తే ప్రతి అంశం పై అదే స్థాయి లో వైకాపా మంత్రులు స్పందించ గలరా ?
మొత్తం మీద సినీ పరిశ్రమ విషయం లో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల పై స్పందించిన స్థాయి లో వైఎస్ఆర్సిపి మంత్రులు ఈ రోజు పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశాల పై కూడా స్పందించ గలరా అన్నది వేచి చూడాలి.