ఏపీలో వైసీపీ నేతలు కనిపించడం లేదు. చాలా మంది రాష్ట్రం దాటి వెళ్లిపోతే ఉన్న కొంత మంది బయటకు రాకుండా తాము ఎక్కడ ఉన్నామో ఎవరికీ తెలియకుండా టైం పాస్ చేస్తున్నారు. చంద్రబాబునాయుడు ప్రతి వారానికి ఓ వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో సంచలన విషయాలు బయటపెడుతున్నారు. ఇవన్నీ చర్చనీయాంశమవుతున్నాయి. ఈ ఆరోపణల్ని ఖండించడానికి పేర్ని నాని, మెరుగు నాగార్జున వంటి వారు తూ…తూ మంత్రంగా ప్రెస్మీట్ పెట్టి.. సజ్జల ఆఫీసు నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదివేసి వెళ్లిపోతున్నారు.
బయట కనిపించని వైసీపీ సీనియర్లు
వైసీపీ సీనియర్ నేతలు బయట కనిపించడం లేదు. సిక్కోలు నుంచి చిత్తూరు వరకు అదే పరిస్థితి. ఉత్తరాంధ్ర మొత్తం నీదేనన్న అని చెబితే ఉత్సాహపడిపోయి భార్యను విశాఖలో పోటీకి దించి ఘోర పరాభవానికి గురైన బొత్స… ప్రతీ రోజూ తనపై వస్తున్న ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఎప్పుడైనా ప్రెస్మీట్ పెడితే ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడి.. వైసీపీని ఇబ్బంది పెట్టేలా కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల అది కూడా చేయడం లేదు. ధర్మాన దగ్గర నుంచి పెద్దిరెడ్డి వరకూ ఏ ఒక్క సీనియర్ కూడా పార్టీ కోసం పని చేసే పరిస్థితుల్లో లేరు. చాలా మంది అసలు ఏపీలో లేరు.. ఉన్నా బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు.
అధికారంలో ఉన్నప్పుడు చేసిన నిర్వాకాలతో భయం భయం
అత్యధిక మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. తమ చేతిలో అధికారం ఉందని అడ్డగోలుగా దోచుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రువులుగా చేసుకున్నారు. ఇప్పుడు అధికారం పోవడంతో.. తాము బాధలు పెట్టిన వారు ఊరుకోరని అందుకే వీలైనంత కాలం ఎవరికీ కనిపించకుండా పోతే మంచిదని అనుకుంటున్నారు. అదే చేస్తున్నారు. ద్వారంపూడి, కొడాలి నాని , రోజా లాంటి వాళ్లంతా ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎవరూ రాష్ట్రంలో లేరు. మళ్లీ రావాలని కూడా అనుకోవడం లేదు.
స్వయంగా పార్టీ అధ్యక్షుడే పరార్ – ఇక నేతలకు ఎలా ధైర్యం ?
స్వయంగా పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డే రాష్ట్రంలో ఉండటం లేదు . రఘురామ కేసు సీరియస్ అవుతుందని తెలియడంతో ఆయన ప్రజాదర్భార్ ప్రారంభిస్తానని చెప్పిన రోజే స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని మరీ బెంగళూరు వెళ్లిపోయారు. అక్కడేం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. మొత్తంగా పార్టీ అధ్యక్షుడితో సహా అందరూ ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పార్టీది కూడా అదే పరిస్థితి.