ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు.. ఏపీ మంత్రులు కన్నబాబు, కొడాలి నాని, అనిల్ లేఖ రాశారు. రైతులకు ధాన్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన రూ.4,724 కోట్ల బకాయిలను విడుదల చేయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పోలవరం ఆర్ అండ్ ఆర్, ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇప్పించడంలోను ప్రత్యేక చొరవ చూపించడం ద్వారా రాష్ట్రానికి సహకరించాలని ఉప రాష్ట్రపతిని కోరారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిన ప్రాజెక్టులు, సంస్థల విషయంలోగానీ.. మీరు ప్రత్యేక చొరవ, శ్రద్ధ చూపించి కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన ఆర్థిక వనరులను ఇప్పించాని విజ్ఞప్తి చేశారు.
వెంకయ్యనాయుడు అంటే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పడదు. ఆయన పలుమార్లు.. ఉపరాష్ట్రపతిని విమర్శించారు. సాక్షాత్తూ.. అసెంబ్లీలోనే వెంకయ్యనాయుడు పేరు పెట్టి విమర్శించిన సందర్భాలున్నాయి. అలాంటిది హఠాత్తుగా.. వెంకయ్యనాయుడుకి ముగ్గురు మంత్రులు లేఖ రాయడం… రాయకీయవర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. దీనికి కారణం.. వెంకయ్యనాయుడు ఇటీవల రాష్ట్రానికి సంబంధించిన .. అభివృద్ధి పనుల పురోగతిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర మంత్రుల్ని.. అధికారుల్ని పిలిపించుకుని ప్రాజెక్టులు ఎక్కడి వరకొచ్చాయో.. సమీక్షిస్తున్నారు. త్వరగా పూర్తి చేయాలని సూచిస్తున్నారు. ధాన్యం రైతుల విషయంలోనూ ఆయన రెండు రోజుల కిందట సమీక్ష చేసి..నిధులివ్వాలని సూచించారు. అందుకే.. నలుగురు మంత్రులు లేఖ రాసినట్లుగా తెలుస్తోంది.
భారతీయ జనతా పార్టీతో.. వైసీపీ అగ్రనేతలు దగ్గరి సంబంధాలు కొనసాగిస్తున్నారు. వారు రాజ్యసభ సీటు అడిగితే.. ఇచ్చేస్తున్నారు. ఎన్నార్సీ, సీఏఏలకు పార్లమెంట్లో మద్దతు కూడా ఇచ్చారు. అయినప్పటికీ.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మాత్రం గట్టిగా పట్టుబట్టలేకపోతున్నారు. చివరికి .. వారు వెంకయ్యనాయుడు మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు అధికారాలు పరిమితం. ప్రత్యేక ఆసక్తితో .. ఆయనపై ఉన్న గౌరవంతో మంత్రులు వచ్చి సమాధానాలిస్తారు. కానీ ఏపీ సర్కార్ ప్రమేయం .. చొరవ లేకుండా నిధులివ్వరు. అలాంటి ప్రయత్నం ఏపీ వైపు నుంచి సాగడం లేదనే విమర్శలు ఉన్నాయి.