ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. అయితే, వైకాపా నేతలకంటే ముందుగానే పవన్ కల్యాణ్ పోలవరం వెళ్లడంతో ఫోకస్ అంతా జనసేనాని వైపు మళ్లింది. పోలవరం ప్రాజెక్టుపై పవన్ చేసిన వ్యాఖ్యలే మీడియాలో ప్రముఖంగా మారాయి. ఆ తరువాత, వైకాపా నేతలు వెళ్లారు. తాము పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నామని తెలుసుకుని, తమ కంటే ముందుగానే పవన్ కల్యాణ్ వెళ్లారంటూ కొంతమంది వైకాపా నేతలు ఆరోపించారు. ఆ విమర్శను కాసేపు పక్కనపెడితే పోలవరం సందర్శించిన తరువాత వైకాపా నేతలకు కొత్తగా వచ్చిన స్పష్టత ఏంటీ..? ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్టు ఎక్కడ చూసినా అవినీతే కనిపించిందా..? చంద్రబాబు నాయుడు చెబుతున్నట్టు మరో ఏడాదిలో ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి ఉందా లేదన్నది వారికి అర్థమైందా..? ఈ పర్యటన ద్వారా ప్రతిపక్ష పార్టీ నేతలకు అర్థమైందేంటీ..? ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే భిన్నాభిప్రాయాలే వ్యక్తమౌతాయి.
గడచిన రెండు రోజులుగా పోలవరం పనులు ఆగిపోయి ఉన్నాయనీ, గురువారం నాడు వైకాపా నేతలు వస్తారన్న విషయం తెలుసు కాబట్టి, ప్రాజెక్టు సైట్ వద్ద పనులు జరుగుతున్న హడావుడి వారికి కనిపించిందట! అంతేకాదు… వైకాపా నేతలు, మీడియా అక్కడ ఉన్నంత వరకూ మాత్రమే పనుల హడావుడి ఉందట, ఆ తరువాత పరిస్థితి యథాతథంగా ఉందట! ఈ పరిస్థితిని బట్టి వైకాపా నేతలు ఒక అంచనాకి వచ్చారనీ, ముఖ్యమంత్రి చెబుతున్నట్టుగా మరో ఆరు నెలల్లో ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి లేదంటూ ‘సాక్షి’ కథనంలో పేర్కొన్నారు. వైకాపా నేతలు వస్తారు కాబట్టే పనులు జరుగుతున్నట్టు హడావుడి చేశారనడం సరైన విశ్లేషణ కానే కాదు. ఎందుకంటే, గడచిన రెండు నెలలుగా పోలవరం పనుల నత్త నడకన సాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. కేంద్రం కొర్రీలు నేపథ్యంలో పనుల వేగం తగ్గిందనే కదా అందరి ఆవేదనా..? వైకాపా నేతలు సందర్శనకు వస్తారని పనుల చేస్తున్న కనిపించాలనే పరిస్థితి ఎలా ఉంటుంది..?
ఇక, వైకాపా నేతల విమర్శల విషయానికి వస్తే… కేవలం ముడుపుల కోసమే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు చేపడుతున్నారని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. పోలవరం పనులన్నీ టీడీపీ నేతల ధనదాహం తీర్చడం కోసమే జరుగుతున్నాయని బొత్స సత్యనారాయణ అన్నారు. ఇక, ఇతర ప్రముఖ నేతలు కూడా ఇలానే తలా ఓ విమర్శ చేసుకుంటూ వచ్చారు.
వైకాపా నేతలతోపాటు మీడియా బృందం కూడా బస్సులో కలిసే పోలవరానికి వెళ్లింది. మీడియా ముందు వైకాపా నేతలు చేస్తున్న విమర్శలకీ, ఆఫ్ ద రికార్డ్ బస్సులో మీడియా మిత్రులతో మాట్లాడిన దానికీ చాలా తేడా ఉందంటున్నారు. పోలవరం దగ్గర పరిస్థితి మరీ అనుకున్నంత ఘోరంగా లేదనీ, పనులు బాగానే జరుగుతున్నాయని ఆఫ్ ద రికార్డుగా కొంతమంది నేతలు అభిప్రాయపడ్డారట! 2014 నాటికీ ఇప్పటికీ చాలా తేడా ఉందనీ, తాము పోలవరం ప్రాజెక్టుకు వస్తున్నామని తెలిసి అడ్డుకునే ప్రయత్నంగానీ, అక్కడి అధికారుల సహాయ నిరాకరణగానీ లేదనీ, తాము అడిగిన సమాచారమంతా అక్కడున్న ఇంజినీర్లు ఇచ్చారనీ వైకాపా నేతలే మీడియా ప్రతినిధులతో ఆఫ్ ద రికార్డ్ చెప్పినట్టు తెలుస్తోంది. కానీ, మైకుల ముందుకు వచ్చేసరికి వారి విమర్శలు మరోలా ఉన్నాయి. నిజానికి, ప్రాజెక్టు సందర్శన తరువాత వైకాపా నేతలు కొత్తగా తెలుసుకున్నది ఏదీ లేదు. ఇంతకుముందు చేసిన విమర్శలే.. ఇప్పుడు ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి చేశారు, అంతే. వారికి కొత్తగా వచ్చిన స్పష్టత ఏంటో… తద్వారా ప్రాజెక్టు విషయమై వైకాపా స్టాండ్ లో వచ్చిన మార్పు ఏంటో వారే చెప్పాలి. ఏదేమైనా, వైకాపా నేతలకంటే పవన్ కల్యాణ్ ముందుగా పోలవరం ప్రాజెక్టుకు వెళ్లడంతో… ఫోకస్ అంతా పవర్ స్టార్ వైపే మళ్లిందనడంలో సందేహం లేదు.