” నేను ఓ మాదిరిగా కూడా కనిపించడం లేదా ? మరీ అంత వెధవలాగా కనిపిస్తున్నానా ?” అని తనకు పిట్టకథలు చెబుతున్న జేడీ చక్రవర్తిని ఉద్దేశించి బ్రహ్మానందం చెప్పే డైలాగ్. ఆ సమయంలో బ్రహ్మానందం హావభావాలు ఎపిక్. ఎప్పుడు ఎవరు ఇలాంటి పిట్టకథలు చెబుతున్నా.. ఆ సీన్‌నే గుర్తు చేసుకుని ” నేను ఓ మాదిరిగా కూడా కనిపించడం లేదా ? ” అని అడిగే పరిస్థితి. ఇప్పుడు వైసీపీ నేతలను ఉద్దేశించి ఏపీ ప్రజలు కూడా ఇదే అడగాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రజల్ని మరీ తేలికగా తీసుకుంటున్న వైసీపీ నేతలు ఇష్టారీతిన నాలుక మడతేస్తున్నారు..ఆ ప్రజలేగా అనుకుంటున్నారు.
సన్నబియ్యం దగ్గర్నుంచి మద్య నిషేధం వరకూ !
జగన్ అధికారంలోకి వచ్చిన మొదట్లో సన్నబియ్యం ఇస్తామన్నారు. విస్తృతంగా ప్రచారం చేశారు. గడువు కూడా పెట్టారు. సన్నబియ్యం పేరుతో బస్తాలను రెడీ చేయించారు. కానీ ఇవ్వలేమని తర్వాత తెలిసింది.దాతో ఒక్క సారిగా నాలుక మడతేశారు. అత్యంత దారుణంగా సన్నబియ్యం ఇస్తామని మీ అమ్మ మొగుడు చెప్పాడా అంటూ ప్రజలపై మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. అప్పట్నుంచి ప్రారంభమైంది.. సీపీఎస్ రద్దు సహా అనేక అంశాలపై అలాంటి మాటలే వచ్చాయి. చివరికి మేనిఫెస్టోలో స్పష్టంగా కనిపిస్తున్నా.. మద్యనిషేధ హామీ ఇవ్వలేదని గుడివాడ అమర్నాథ్ నిస్సిగ్గుగా అనేశారు. ప్రజలను చాలా తక్కువగా అంచనా వేశారు.
ప్రజలకూ ఏమీ గుర్తుండదని అనుకుంటున్నారా ?
ప్రజల జ్ఞాపకశక్తిపై వైసీపీ నేతలు దారుణమైన అభిప్రాయంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క అంశం పూర్తి స్థాయిలో అమలు చేయకపోయనా అన్నీ చేసేశామని చెబుతారు. చేయని వాటిని తాము అలాంటి హామీ ఇవ్వలేదని చెబుతారు. నలభై ఐదేళ్లకు పెన్షన్ ఇస్తామని జగన్ ఊరూవాడా ప్రచారం చేసిన మాట నిజం. కానీ ఇప్పుడు ఆ హామీ ప్రస్తావనే లేదు. కానీ అలాంటి హామీ ఇవ్వనేలేదని వాదిస్తున్నారు. వైసీపీ నేతలు.. ప్రజలకు పెద్దగా ఏదీ గుర్తుండదని.. గుర్తుంచుకోరని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో వ్యవహరిస్తున్నట్లుగా చెబుతున్నారు.
రూ. పదివేలిస్తే ఓట్లేస్తారని అంత నమ్మకమా ?
వైసీపీ నేతలు పాలన చేపట్టినప్పటి నుండి ఓటు బ్యాంక్ కోసం రాజకీయాలు చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. అయితే తమ జీవితాల్ని నాశనం చేస్తున్నా… ఓటు బ్యాంక్ కాబట్టి ఈ పాలనకు ఓటేస్తారని అనుకోవడం… చెప్పిన పనులు చేయకుండా.. ఇలా అడ్డగోలుగా మాట్లాడినా పట్టించుకోరని అనుకోవడం అవివేకం. ఇప్పుడు తిరుగుబాటు చేయలేదంటే.. సైలెంట్‌గా ఉన్నారంటే అర్థం .. ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించినట్లుగా కాదు. ఆ విషయం చరిత్రలో చాలా సార్లు బయటపడింది. అందుకే ఇప్పటికైనా.. ఓటర్లను గౌరవించడాన్ని వైసీపీ నేతలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.