వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై.. విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి ఘటన విషయంలో… ఆ పార్టీ నేతల తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. జగన్ పై దాడి చేసిన కత్తిని బొత్స సత్యనారాయణ సోదరుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, విశాఖ వైసీపీ నేత మళ్ల విజయ్ ప్రసాద్ బయటకు తీసుకెళ్లిపోయారు. కత్తిని సీఐఎస్ఎఫ్ పోలీసులు వెంటనే స్వాధీనం చేసుకోలేదు. ఏపీ పోలీసులు.. తర్వాత దాడి చేసిన ఆయుధాన్ని అడిగితే.. తడుముకోవడం.. సీఐఎస్ఎఫ్ పోలీసుల వంతయింది. వారు వైసీపీ నేతలకు ఫోన్ చేస్తే.. గంట తర్వాత తీసుకొచ్చి ఇచ్చారు. అది చాలా క్లీన్గా ఉంది. దానిపై రక్తపు మరకలు లేవు. దీనిపై మంత్రి దేవినేని ఉమ తీవ్ర విమర్శలు చేశారు.
కానీ బొత్స మేనల్లుడు మాత్రం.. తాను ఏపీ పోలీసులకు చెప్పాల్సింది ఏమీ లేదని.. తానేమీ వారికి చెప్పబోననని.. సీఐఎస్ఎఫ్ అధికారులు నన్ను సంప్రదిస్తే చెబుతానంటున్నారు. అదే సమయంలో.. ఇలాంటి దాడి జరిగినప్పుడు సాక్ష్యంగా.. రక్తపు మరకలు అంటిన చొక్కాలను.. పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఆ చొక్కాను.. ఇవ్వడానికి నిరాకరించారు. అంటే.. అసలు జగన్కు గాయం అయినట్లుగా… రక్తం మరకలు సాక్ష్యంగా చూపించడానికి.. అటు కత్తిపై రక్తపు మరకలు లేవు.. ఇటు జగన్ చొక్కాని ఇవ్వడం లేదు. ఇది పోలీసులకు మరిన్ని చిక్కులు తెచ్చి పెడుతోంది. దాడి జరిగిందని చెబుతున్న చోట సీసీ కెమెరాలు లేవు. ఎయిర్ పోర్టులో అడుగు అడుగు కవర్ చేస్తూ.. సీసీ కెమెరాలు పెడతారు. కానీ అక్కడ మాత్రం ఎందుకు పెట్టలేదో.. ఎవరికీ అర్థం కావడం లేదు. అందుకే అసలు దాడి జరిగిందా.. లేక అందరూ కలిసి ఏదైనా నాటకం అడుతున్నారా..అన్న అనుమానాలు టీడీపీ వైపు నుంచి పెరిగిపోవడానికి కారణం అవుతున్నాయి. జగన్ మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు చెప్పాలని.. టీడీపీ సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
మరో వైపు .. ఈ విషయాన్ని… వైసీపీ నేతలు.. జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారు. జగన్ పై హత్యాయత్నం జరిగిందని… రాష్ట్రపతి నుంచి ప్రతి ఒక్కరికి చెప్పేందుకు ఓ బృందం ఢిల్లీ చేరుకుంది. ప్రత్యామ్నాయ ఏజెన్సీతో విచారణ జరిపించాలని వారు కోరనున్నారు. మొత్తానికి.. సాక్ష్యాలు మొత్తం తారుమారైన పరిస్థితులను.. వైసీపీ నేతలే సృష్టించారు. ఇప్పుడు… పోలీసుల విచారణపై నమ్మకం లేదంటున్నారు. కేసు కాస్తంత క్లిష్టమైన వ్యవహారంగానే మారిపోయింది.