వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు.. ఆ పార్టీలోని ఏ ఒక్క నేత కూడా ముందుకు రాలేదు. మీడియాతో మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపించలేదు. దానికి కారణం.. అవి పూర్తిగా వ్యక్తిగత విమర్శలు కావడం ఓ కారణమైతే.. ఎలా సమర్థించుకోవాలో అర్థం కాకపోవడం మరో కారణం. టీవీ చానళ్లలో చర్చలకు ముందు ఉండే నేతలు కూడా.. నిన్న ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు. విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఓ చానల్.. జనసేనకు మద్దతుగా వార్తలు ప్రసారం చేస్తూ ఉంటుంది. ఆ చానల్లో జగన్ వ్యాఖ్యలపై జరపదలుచుకున్న చర్చకు.. ఆహ్వానిస్తే.. ఒక్కరూ కూడా రాలేదని… చర్చాకార్యక్రమాలు నిర్వహించే యాంకర్ బహిరంగంగానే చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసినా… ఆ వివాదాన్ని మాత్రం పెద్దది చేయకూడదన్న ఉద్దేశంలో వైసీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. పవన్‌తో వైరం పెంచుకుంటే… ఓ బలమైన సామాజికవర్గంతో పాటు.. ఇంత కాలంగా… వైసీపీకి మద్దతుదారులుగా ఉన్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా.. జనసేన వైపు పోలరైజ్ అవుతుతారన్న అంచనాలు ఏర్పడటమే దీనికి కారణం. అందుకే సాక్షి మీడియా కూడా… పవన్ కల్యాణ్ పై జగన్ చేసిన విమర్శలను ఖండిస్తూ.. అనేక మంది ప్రకటనలు చేసినా కూడా పట్టించుకోలేదు. ఉండవల్లి అరుణ్‌కుమార్ లాంటి నేతలు .. జగన్ .. చాలా పెద్ద తప్పు చేశారని నేరుగా చెప్పినా.. ఆ విషయం వదిలేసి.. తమకు కావాల్సిన వార్తలను ప్రసారం చేసుకుంది.
వైసీపీలోని కాపు సామాజికవర్గం నేతలు కూడా.. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై.. నొచ్చుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఓ వైపు పవన్ కల్యాణ్ గోదావరి జిల్లాల యాత్రకు వచ్చినప్పుడే.. ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముందని వారు మథన పడుతున్నారు. పవన్ కల్యాణ్‌కు అంతో ఇంతో బలం ఉందని.. అంచనా వేస్తున్న జిల్లాలు గోదావరి జిల్లాలే. సామాజికవర్గ ఓటర్లు అత్యధికంగా ఉండటంతో… పవన్‌పై చేసే విమర్శల ప్రభావం..కచ్చితంగా తమపై ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ అంచనా వేసుకుని.. అధినేతను సమర్థిస్తూ మాట్లాడి…వివాదాన్ని పెద్దది చేసుకోవడం కన్నా.. సైలెంట్‌గా ఉండటం బెటరని..వైసీపీ నేతలు భావిస్తున్నారు.