కరోనా కట్టడి.. బాధితుల్ని ఆదుకునే విషయంలో జగన్ చేతులెత్తేశారంటూ వైసీపీ ముఖ్య నేతలు.. పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్, ఆకుల సత్యనారాయణ లాంటి వాళ్లంతా పిచ్చాపాటిగా మాట్లాడుకున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఓ వైపు చేసుకునే పబ్లిసిటీకి… వీరు మాట్లాడుకున్న మాటలకు చాలా తేడా ఉండటంతో సహజంగానే ఈవీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. కెమెరాలు ఏమీ లేవని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకున్నారు నేతలు. కరోనా కారణంగా ప్రభుత్వం నిస్సహాయంగా మారిపోవడం వల్ల పేదలు ఇబ్బందులు పడుతున్నారని నేతలు చెప్పుకున్నారు. కరోనా మృతదేహాన్ని తరలించడానికి 30వేలు… అంత్యక్రియలకు పన్నెండు వేలు వసూలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఎలాంటి సాయం చేయడం లేదనేది వారి చర్చల సారాంశం.
రాజమండ్రిలో రెండు రోజుల కిందట.. అంతిమ యాత్ర వాహనాన్ని ప్రారంభించారు. ఎంపీ పిల్లి సుభాష్ చేతుల మీదుగా ఆ వాహనాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమానికి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్తో పాటు రాజమండ్రి ఇంచార్జి ఆకుల సత్యనారాయణతో పాటు మరికొంత మందిసీనియర్ నేతలు హాజరయ్యారు. వాహాన్ని ప్రారంభించే కార్యక్రమానికి ముందో.. తర్వాత రిలాక్స్ అయ్యారు. ఆ సందర్భంగా కోవిడ్ బాధితులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా జగన్ పనితీరుపై ఒకరి తర్వాత ఒకరు సర్టిఫికెట్లు ఇచ్చేశారు. జగన్ ఏమి చేశాడు బొక్క అని నాటు పద్దతిలో మాట్లాడుకున్నారు.
నిజానికి ఏపీ సర్కార్ బయట చేసుకుంటున్న ప్రచారానికి క్షేత్ర స్థాయి పరిస్థితులకు చాలా తేడా ఉంది. కరోనాకు ఆరోగ్య శ్రీ చికిత్స ఎక్కడా చేయడం లేదు కానీ.. అందరికీ ఉచిత వైద్యం ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో వైసీపీ నేతల కన్ఫెషన్ లాంటి వీడియో బయటకు రావడం… నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. విపరీతంగా వైరల్ అవుతోంది. ఆంధ్రలో ఉన్న పరిస్థితుల్ని వీరు తమ మాటల ద్వారా బయట పెట్టారని చెప్పుకుంటున్నారు.
అయితే ఈ వీడియోపై.. వైసీపీ ఎదురు దాడి చేయడం కామనే. అది ఫేక్ అనో..మార్ఫింగో అనో చెప్పడంతో పాటు.. సీఐడీ పేరుతో కేసులు పెట్టి.. దేవినేని ఉమను వేధిస్తున్నట్లుగా కొంతమంది టీడీపీ నేతల్ని లేదా సోషల్ మీడియా కార్యకర్తల్ని వేధించినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఎందుకంటే.. ఇలాంటి వాటికి సీఐడీ చాలా మందు ఉంటుంది. వైసీపీ పరువు పోయేలా వ్యాఖ్యలు చేసిన నేతల్ని… పైకి వైసీపీకి డిఫెండ్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
https://twitter.com/Telugu360/status/1390169255992340488?s=20