కోడి కత్తి కేసులో యన్.ఐ.ఎ ప్రాధమిక ఛార్జిషీట్ ను దాఖలు చేసింది.. ఈ కేసులో తొమ్మిది పేజీలు ఉన్న ఛార్జిషీట్ తో పాటు నిందితుడు జిన్నేపల్లి శ్రీనివాసరావు రాసుకున్న 22పేజీల లేఖను కూడా న్యాయస్థానానికి యన్.ఐ.ఎ అందించింది. అయితే… ఎన్ఐఏ చార్జిషీట్ వేస్తుందని వైసీపీ కి ఎలా తెలిసిందో కానీ.. నిన్నంతా ఆ పార్టీకి చెందిన నేతలు వరుసగా.. ఆ చార్జిషీటులో ఏముందో పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. జగన్ పై దాడి కేసులో కుట్ర కోణం ఉందని.. ఎన్ఐఏ చార్జిషీటులో ఉందని.. బొత్స సహా పలువురు ప్రకటించారు. సహజంగానే తమ ఆరోపణలన్నీ.. టీడీపీ మీదకే వెళ్తాయి కాబట్టి వెళ్లాయి. కానీ.. అసలు కేసును పూర్తి స్థాయిలో పరిశోధించకుండా… ఏపీ పోలీసులు రికార్డులు ఏమీ ఇవ్వలేదని చెబుతూనే.. ప్రాథమిక చార్జిషీట్ ఎందుకు దాఖలు చేశారన్నది ఓ ఆసక్తికరమైన అంశం కాగా.. ఇందులోనూ పక్కాగా ప్లాన్ చేసుకున్నట్లుగా.. వైసీపీ నేతలు.. మీడియా ముందుకు రావడం… మరో వ్యూహం.
నిజానికి ఎన్ఐఏ ప్రిలిమినరీ చార్జిషీట్లో దాడి జరిగిన క్రమాన్ని వివరించారని చెబుతున్నారు. జనవరి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు శ్రీనివాసరావును ఎన్ఐఏ తమ కస్టడీకి తీసుకుంది. సాక్షి సమక్షంలో శ్రీనివాసరావు చెప్పిన విషయాలను.. కోర్టుకు సమర్పించారు. కోడి పందాలలో స్థానికంగా ఉపయోగించే కత్తిని 2018 జనవరిలో శ్రీనివాసరావు సేకరించారని, తన గ్రామానికి సమీపంలో జరుగుతున్న కోడి పందాల వద్ద ఈ కత్తిని సేకరించినట్లు శ్రీనివాసరావు చెప్పారని ఛార్జిషీట్ లో పేర్కొన్నట్లు ఎన్ఐఏ వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడి కేసులో ఏదైనా కుట్ర గానీ, లేదా ఎవరైనా ప్రొత్సాహం గానీ ఉందేమో తెలుసుకునేందుకు సి.ఆర్.పి.సి లోని 173 (8) కింద దర్యాప్తు కొనసాగుతుందని యన్.ఐ.ఎ ఛార్జిషీట్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ చార్జిషీట్ వివరాలు ఈ నెల ఇరవై ఐదున పూర్తి స్థాయిలో బయటకు రానున్నాయి.
కోడికత్తి కేసులో.. వైసీపీ వాదన చూస్తే.. ఎలాగైనా.. దాన్ని తెలుగుదేశం పార్టీ మీద నెట్టేస్తే.. ఎంతో కొంత సానుభూతి వస్తుందన్న ప్రయత్నంలో ఉన్నట్లుగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణకు హైకోర్టు ఆదేశించక ముందే.. కేంద్రం తన చేతుల్లోకి కోడికత్తిని తీసుకోవడమే ఓ అనుమానాస్పద వ్యవహారం అయితే… ఇందులోనూ.. వైసీపీ నేతలు.. కేసు ఎలా ఉండాలి.. చార్జిషీటు ఎలా ఉండాలనే అంశంపై.. రోజూ… ఎన్ఐఏకి డిక్టేట్ చేస్తున్నట్లుగా.. ప్రకటనలు చేయడం.. మరింత వివాదాస్పదం అవుతోంది.