తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి భేటీ… ఏపీ రాజకీయాల్లో చర్చనీయంశంగా మారిన సంగతి తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో కీలకమైన ప్రాంతీయ శక్తుల్ని ఏకం చేసే క్రమంలోనే జగన్ ను కలిశామన్నది తెరాస అభిప్రాయం. ఏపీకి హోదా సాధన దిశగా కేసీఆర్ సానుకూలంగా ఉన్నారు కాబట్టే తెరాసతో చర్చించామని జగన్ అన్నారు. కానీ, ఈ భేటీ వెనక ఉన్న రాజకీయ కుట్ర కోణమే ఏపీ ప్రజల్లోకి బలంగా టీడీపీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఆంధ్రా ప్రయోజనాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తున్న కేసీఆర్ తో జగన్ పొత్తు పెట్టుకుంటున్నారు అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తోంది. ఇంకోపక్క, ఈ కొత్త స్నేహం వల్ల ఆంధ్రాలో వైకాపాకి నష్టమే అని విశ్లేషణలు కూడా బాగానే వినిపిస్తున్నాయి. దీంతో వైకాపాలో కొంత చర్చ జరుగుతున్నట్టుగానే కనిపిస్తోంది! ఈ భేటీ ప్రభావాన్ని తగ్గించే విధంగా వైకాపా నేతలు మీడియా సమావేశాలు పెట్టి, ప్రజలకు వివరణ ఇచ్చుకునే విధంగా మాట్లాడుతున్నారు.
కేటీఆర్, జగన్ భేటీలో పొత్తుల ప్రస్థావనే లేదన్నారు వైకాపా నేత బొత్స సత్యనారాయణ. ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటులో భాగంగానే ఈ సమావేశం జరిగిందనీ, దీనిపై టీడీపీ లేనిపోని అపోహలకు ప్రజలకు కల్పిస్తోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తామనీ, ఎన్ని అవమానాలైనా భరిస్తామని తమ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తమతో చెప్పారన్నారు. వైకాపా అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ స్పందించారు. అయితే, ఆమె షర్మిల అంశాన్ని ప్రధానంగా ప్రస్థావిస్తూ విమర్శలు చేశారు. ఇక, అంబటి రాంబాబు కూడా జగన్, కేటీఆర్ భేటీపై వివరణ ఇచ్చే ప్రయత్నమే చేశారు. ఇది కేవలం ఫెడరల్ ఫ్రెంట్ కోసం జరిగిన భేటీ మాత్రమే అనే అంశాన్ని పదేపదే చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు.
వైకాపా నేతల స్పందన చూస్తుంటే… ఆ భేటీని ఏపీ ప్రజలు ఎలా అర్థం చేసుకున్నారనేది దాదాపు అర్థమైపోతోంది. జగన్, కేటీఆర్ భేటీని పొత్తుల కోసం కాదంటున్నా, ఫెడరల్ ఫ్రెంట్ కోసమే అని చెప్పినా, ప్రత్యేక హోదా సాధనలో భాగంగానే జరిగిందన్నా నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఏపీ ప్రయోజనాలకు అడ్డుపడే కేసీఆర్ తో పొత్తులకు జగన్ ఎలా వెళ్తారనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లోంచి మొదలైంది. ఫెడరల్ ఫ్రెంట్ కోసమే అనుకున్నా… కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదుకదా.. ఇప్పుడు వైకాపాతో చర్చించి ప్రయోజనం ఏంటనే ప్రశ్నా ప్రజల నుంచీ వస్తున్నదే. పోనీ, ప్రత్యేక హోదా సాధన కోసమే ఈ భేటీ అని చెప్పుకున్నా… ఆంధ్రాకి హోదా అంటే అడ్డుపడ్డ కేసీఆర్ ద్వారా అదెలా సాధ్యం అనే ప్రశ్నా ప్రజల నుంచే వినిపిస్తోంది. ఎలా చూసుకున్నా… వైకాపా, తెరాస కొత్త స్నేహం సానుకూల పరిణామంగా ప్రజలు చూస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. అందుకే వైకాపా నేతల్లో కొంత కలవరపాటు కనిపిస్తోంది!