ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు “సర్వే రాజకీయం” ఊపందుకుంటోంది. ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు ప్రజల్లో తిరుగుతున్న సర్వే సంస్థలకు చెందిన వారిని పట్టుకుంటున్న వైసీపీ నేతలు.. వారిని పోలీసులకు అప్పగిస్తున్నారు. వారు చెబుతున్న కారణం ఏమిటంటే… వైసీపీకి ఓటేస్తామని ఎవరైనా చెబితే.. వారి ఓట్లను తొలగిస్తున్నారట..!. ఓట్లను అంత ఈజీగా.. ఎవరు పడితే వారు తొలగించడానికి అవకాశం ఉండదని… ఎన్నికల అధికారి తన వద్దకు వచ్చిన వైసీపీ ప్రతినిధి బృందానికి.. చెప్పినప్పటికీ.. వారు ఏ మాత్రం సంతృప్తి చెందడం లేదు. ఏపీలో ఎవరు ఏ సర్వే చేసినా.. అది తమ ఓటర్లను గుర్తించి.. వారి ఓట్లను తొలగించడానికేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సర్వే బృందాలను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తున్నారు. మూడు రోజుల కిందట… విజయనగరం జిల్లాలో .. బొత్స మేనల్లుడు.. ఇలా ఓసర్వే బృందంపై దౌర్జన్యం చేసి వార్తల్లోకి ఎక్కగా… నిన్న శ్రీకాకుళం, విజయవాడల్లోనూ.. ఇలాగే జరిగాయి.
శ్రీకాకుళంలో పబ్లిక్ పాలసీ రీసెర్చ్ గ్రూప్‌నకు చెందిన ఎనిమిది మంది యువకులు.. ప్రజాభిప్రాయం సేకరిస్తున్న సమయంలో వైసీపీ నేతలు వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనూ.. అదే పరిస్థితి. ఓ సర్వే బృందాన్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. వారు వైసీపీ ఓట్లను తీసేస్తున్నారని… హడావుడి చేశారు. తాము ఓ సర్వే బృందాన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించామని.. .. వైసీపీ కేంద్ర కార్యాలయానికి సమాచారం ఇచ్చి.. కాలర్ ఎగరేశారు. కానీ కాసేపటికి వారికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఉన్న పళంగా.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి… అప్పగించిన వారికి…హామీ ఇచ్చి.. వారిని విడుదల చేయాలని వైసీపీ ఆఫీసు నుంచి ఆదేశాలొచ్చాయి. ఎందుకిలా అని ఆరా తీస్తే.. ఆ సర్వేలు చేస్తోంది… వైసీపీకి సేవలు అందిస్తున్న ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐపాక్ సంస్థకు చెందిన వారట. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుందో.. వారు సర్వే చేస్తున్నారు. వెంటనే తామే వెళ్లి పోలీసులకు అప్పగించిన వారిని.. తామే విడిపించుకొచ్చారు వైసీపీనేతలు.
సర్వేలు చేస్తున్న వారందరూ.. వైసీపీ ఓట్లు తీసేయడానికేనన్నట్లుగా.. కొద్ది రోజులుగా.. వైసీపీ నేతలు, ఆ పార్టీకి చెందిన సాక్షి మీడియా ప్రచారం చేస్తోంది. నిజానికి వైసీపీ సహా… అన్ని పార్టీలు సర్వేలు చేయించుకుంటున్నాయి. ఇక మీడియా సంస్థలు కూడా అదే పనిలో ఉన్నాయి. పీకే సంస్థ ఐపాక్ తో పాటు పబ్లిక్ పాలసీ రీసెర్చ్ లాంటి సంస్థలు కూడా ఈ సర్వే బృందాల్లో ఉన్నాయి. ఏమైనప్పటికీ.. సర్వేలు కూడా చేయడం తప్పని.. వైసీపీ చెబుతోంది. కానీ తమ పార్టీకి సేవలందించేవారు మాత్రం సర్వేలు చేయవచ్చని… పరోక్షంగా చెబుతున్నారు.