ఏపీలో రాజధాని ప్రహసనం రసవత్తరంగా సాగుతోంది. ప్రతిపక్షాలన్నీ రాజధాని తరలించవద్దనే ఒకే డిమాండ్ చేస్తున్నాయి. కాని వైకాపా నాయకులు, మంత్రులు మాత్రం రాజధాని వివాదాన్ని ఎంత పెద్దగా చేయాలో అంత పెద్దగా చేస్తున్నారు. మరో మాటలో చెప్పాలంటే పీకి పాకం పెడుతున్నారు. నానా కంగాళీ చేస్తున్నారు. ప్రభుత్వం పోలీసు రాజ్యం నడుపుతోంది. ముఖ్యమంత్రి జగన్ ఒక్క మాటా మాట్లాడకుండా నాయకులతో, మంత్రులతో కథ నడిపిస్తున్నారు. ప్రభుత్వం మూడు రాజధానులంటూ ప్రచారం చేస్తున్నా అసలు రాజధాని విశాఖపట్టణం అనే సంగతి బహిరంగ రహస్యమే.
రాజధాని తరలింపు రహస్యంగా జరగడంలేదు. అలా జరిగేందుకు అవకాశం కూడా లేదు. నెల రోజులకు పైగా జరిగాల్సిన పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. అంతా కళ్ల ఎదురుగా కనిపిస్తూనే ఉంది. రాజధానిని తరలిస్తున్నట్లు చాలాకాలం నుంచి వైకాపా నాయకులు, మంత్రులు బహిరంగంగా చెబుతూనే ఉన్నారు. కొందరు ‘విశాఖపట్టణమే రాజధాని. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అన్నారు. రాజధాని తరలింపు ఎట్టి పరిస్థితిలోనూ ఆగదన్నారు. రాజధాని తరలింపుపై ప్రజల ఆందోళన, వ్యతిరేకత ఎక్కువ అవుతున్నకొద్దీ వైకాపా నాయకులు అంతగా రెచ్చిపోయి ప్రకటనలు, ప్రసంగాలు చేస్తున్నారు. అమరావతిని రాజధానిగా ఉంచడం సాధ్యం కాదని జీఎన్‌రావు, బీసీజీ కమిటీల ద్వారా చెప్పించింది ప్రభుత్వం.
తాజాగా చెన్నయ్ ఐఐటీ వారు అమరావతి మీద పరిశోధన చేసి అది రాజధానిగా పనికిరాదని తేల్చారని ‘సాక్ష’ పత్రిక బ్యానర్ కథనం ప్రచురించింది. విశాఖపట్టణం రాజధాని కావడం తథ్యం. అందులో సందేహం లేదు. వంద శాతం విశాఖే రాజధాని అని వైకాపా నాయకుంతా కోళ్లై కూస్తున్నారు. పరిస్థితి ఇలా ఉండగా, వైకాపా నాయకులే విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ‘అసలు అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందని మీకు ఎవరు చెప్పారు?’ అని ప్రశ్నిస్తున్నారు. ‘ముఖ్యమంత్రి జగన్ చెప్పారా?’ అని అడుగుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ‘మూడు రాజధానులు ఉండొచ్చు’ అని అన్నారు. ఇదో ఆలోచనగా చెప్పారు.
కాని అది ఆలోచన కాదని, నిర్ణయమేనని తెల్లవారి నుంచే అర్థమైపోయింది. ఆ రోజు తరువాత జగన్ ఇప్పటివరకు మాట్లాడలేదు. మొత్తం కథ వైకాపా నాయకులే నడిపిస్తున్నారు. ఎమ్మెల్యే అదీప్ రాజ్ ‘రాజధాని తరలిస్తున్నారని మీకు ఎవరు చెప్పారు?’ అని ప్రశ్నించి ‘రాజధాని తరలించడంలేదు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారు. అంతే’ అన్నాడు. ఏపీఐఐసి ఛైర్పర్సన్ రోజా కూడా ఈమధ్య రాజధాని తరలిస్తున్నట్లు ఎవరు చెప్పారంటూ ప్రశ్నించింది.
అమరావతి రాజధానిగా ఉంటుందని చెబుతూనే దాన్ని రాజధానిగా నిర్మించాలంటే లక్షా పది వేల కోట్లు కావాలంటున్నారు. అసలు వైకాపా నాయకులు ఏం మాట్లాడుతున్నారో అర్థంకావడంలేదు. రాజధాని విషయాన్ని పీకి పాకం పెడుతున్నారు. ఏది రాజధాని అనేది ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకముందే వైకాపా నాయకులు ప్రకటించేశారు. అలాంటప్పుడు రాజధాని మారుతుందని మీకు ఎవరు చెప్పారు అంటూ ప్రశ్నించడం అనవసరం.