ఎన్నికలు అయిపోయి ఏడు నెలలు అయిపోతున్నా అనంతపురం వైసీపీ నేతల్లో భయం పోలేదు. నియోజకవర్గాల్లో గట్టిగా తిరగడానికి సంశయిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ పెట్టుకుని అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన వారికి అసలు ధైర్యం చాలడం లేదు. రాప్తాడు, ధర్మవరం ఎమ్మెల్యేలు రెండు, మూడు సార్లు కూడా నియోజకవర్గంలోకి రాలేదు. ఎక్కడ ఉంటున్నారో వారికి మాత్రమే తెలుసు.
ఇతర నేతలు కూడా తమకేమీ పట్టనట్లుగా ఉంటున్నారు. హిందూపురం నుంచి పోటీ చేసి ఓడిపోయిన దీపికారెడ్డి కనిపించడం లేదు. ఇతర నేతలు తమ పనులు తాము చేసుకుంటున్నారు. కదిరి, పుట్టపర్తి ఇలా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకర్గాల్లోలో వైసీపీలో అసలు కదలిక లేకుండా పోయింది. చివరికి ఎవరూ ముందుకు రాకపోవడంతో గోరంట్ల మాధవ్ కు అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు. ఆయన ఇమేజ్ ఘోరంగా ఉండటంతో. ఇతర నేతలు ఆయనతో కలిసి ప్రెస్మీట్లకు హాజరు కావడం లేదు.
అనంత వెంకట్రామిరెడ్డితో పాటు ఉరవకొండ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విశ్వేశ్వర్ రెడ్డి మాత్రం అప్పుడప్పుడూ తాము ఉన్నామని అనిపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాస్త ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించి ఉంటే ప్రస్తుతం ఈ సమస్య ఉండేది కాదని.. కాస్త ధైర్యంగా నియోజకవర్గాల్లో రాజకీయాలు చేసుకునేవారు. ఆ పరిస్థితి లేకుండా వారే చేసుకున్నారు.