కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదంటారు పూర్వకాలపు పెద్దలు. అంటే మనం చేసే దానధర్మాల గురించి ప్రచారం చేసుకోకూడదని అర్థం. కానీ ఈ కాలంలో ఇలాంటివారు ఎవరున్నారు ? గోరంత దానం కొండంత ప్రచారం అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇక రాజకీయ నాయకుల సంగతి చెప్పక్కరలేదు. గల్లీ నాయకుడి నుంచి ఢిల్లీ నాయకుడి వరకు ప్రచారం కోసం పాకులాడటమే పని. పబ్లిసిటీ కోసం ఏ అవకాశాన్నీ వదులుకోరు. మీడియా తామర తంపరగా పెరిగిపోయాక నాయకులకు ప్రచార కండూతి ఎక్కువైపోయింది.
పదవుల్లో ఉన్నవారే కాదు, మాజీలు సైతం ప్రజల కళ్ళల్లో పడాలని, పార్టీ నాయకుల దగ్గరో, హైకమాండ్ దగ్గరో క్రెడిట్ కొట్టేయాలని తాపత్రయపడుతున్నారు.
సాధారణ రోజుల్లో ప్రచారం కోసం తాపత్రయ పడ్డారంటే ఏదోలే అనుకోవచ్చు. కానీ కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న ప్రస్తుత పరిస్థితిలోనూ పెద్ద, చిన్న నాయకులు పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తున్నారు. పైగా వీరు చేస్తున్న పనులపై విమర్శలు వస్తుంటే సహించలేకపోతున్నారు. విమర్శించినవారిని అసభ్యంగా తిడుతున్నారు. కరోనా బారిన పడకుండా ఉండాలన్న, మనవల్ల వైరస్ మరొకరికి సోకకుండా ఉండాలన్నా సామాజిక దూరం పాటించడం అత్యంత ముఖ్యం. ఈ సంగతి రాజకీయ నాయకులకు తెలుసు. అయినప్పటికీ లెక్క చేయడంలేదు.
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మరీ రకరకాల పంపీణీలు చేస్తున్నారు. ఇలా పంపీణీలు చేయడం సేవ కాదు. కేవలం ఫోటోలు, వీడియోల కోసమే. నాయకులు తమ అనుచరులను వెంటబెట్టుకొని చేస్తున్న ఈ పంపీణీల కారణంగా కరోనా మరింత వ్య్యాప్తి చెందుతోంది. ఆంధ్రాలో కరోనా విపరీతంగా వ్యాప్తి చెందడానికి సేవా కార్యక్రమాల పేరుతో అధికార పార్టీ నాయకులు చేస్తున్న వివిధ పంపీణీలే కారణం. నిత్యావసర సరుకులో, మరొకటో ఉచితంగా పంపిణీ చేస్తున్నారంటే జనం ఎగబడటం సాధారణమే. పంపిణీ చేయడం తప్పు కాదు.
దాన్ని సేవా కార్యక్రమంగానే చేయాలి తప్ప పబ్లిసిటీ స్టెంట్ మాదిరిగా చేయకూడదు కదా. లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తూనే నిర్వహించాలి. మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఆంధ్రాలో వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు విపరీతంగా పంపీణీలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాల్గొంటున్నారు. పోలీసులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. అధికార పార్టీ నాయకులను అడ్డగించి దమ్ము పోలీసులకు లేదు కదా. ఈ మధ్య శ్రీకాళహస్తిలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి.
ఇందుకు కారణం అక్కడి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ బియ్యం లోడ్ ట్రాక్టర్లతో భారీగా చేసిన ర్యాలీ. ఈ ర్యాలీని పోలీసులు చూస్తూనే ఉన్నా అడ్డుకోలేదు. ఈ ర్యాలీ తరువాత కరోనా కేసులు పెరిగిపోయాయి. ఈ ర్యాలీని సమర్ధించుకుంటూ ఎమ్మెల్య్ టీవీ ఛానెళ్లలో మాట్లాడాడు. నగరి ఎమ్మెల్యే, ఏపీ ఐఐసీ చైర్ పర్సన్ రోజా చేసిన పని ఈ మధ్య వివాదాస్పదంగా మారింది. ఆమె పుత్తూరులో ఓ బోరు పంపు ప్రారంభించడానికి వెళ్ళింది. వాస్తవానికి ఇది ఆమె స్థాయిలో చేసే పని కాదు. కానీ ప్రచార కండూతి కారణంగా వెళ్ళింది. ఆమె వెళ్ళినప్పుడు మహిళలు రోడ్డుకు ఇరుపక్కలా నిలబడి రోజాపై పూలు చల్లుతుంటే ఈమె ఆనందంగా తనను తాను మహారాణిలా భావించుకుంటూ ఈ పూల దారిలో వెళ్ళింది. దీనిపై ఆమె ఓ టీవీ ఛానెల్లో మాట్లాడుతూ తనను విమర్శించే వారి తాట తీస్తానని చెప్పింది. లాక్ డౌన్ లోనే రంజాన్ రావడంతో పేద ముస్లిములకు ఆ పంపిణీలు … ఈ పంపిణీలు అనుకుంటూ నాయకులు రోడ్లమీద పడ్డారు. ఇలాంటి పంపిణీలు లాక్ డౌన్ లో అవసరమా ? లాక్ డౌన్ ఎలా అమలు జరుగుతున్నదో పర్యవేక్షించాల్సిన ప్రజాప్రతినిధులు, మంత్రులు పనిగట్టుకొని లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు ఏపీలో చాలా ఉన్నాయి. పంపిణీల పర్వంలో పరాకాష్టగా ఓ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. ఆ జిల్లాలోని ఓ గ్రామంలో నాగిరెడ్డి అనే వైసీపీ నాయకుడు (మాజీ జడ్పిటిసి సభ్యుడు) తన తాత జయంతిని పురస్కరించుకొని గ్రామంలోని తొమ్మిదిమంది బాలికలకు (మైనర్లు) తాళిబొట్లు పంపిణీ చేశాడు. పెళ్లి కుదిరినవారికి తాళిబొట్లు పంపిణీ చేస్తే అందం చందం. కానీ చిన్నపిల్లలకు పంపిణీ చేశాడు మనోడు. కరోనా కారణంగా పెళ్లిళ్లు ఆగిపోయాయి కదా. అందుకని బాలికలకు చేశాడు. పెద్దయ్యాక వీరికి పెళ్లిళ్లు అయితే ఉపయోగపడతాయనుకున్నాడేమో. ఈ పెద్దమనిషి వైసీపీ నాయకుడు కాబట్టి అధికారులు మందలించి వదిలేశారట. లాక్ డౌన్ ఉల్లంఘించే నాయకులను సీఎం జగన్ మందలిస్తున్నట్లుగా కనిపించడంలేదు.