మూడు రాజధానులకు కోర్టు అడ్డం కాదని చెప్పేందుకు వైసీపీ నేతలు తహతహలాడుతున్నారు. రోజు ఓ టైమ్ పెట్టుకుని ప్రెస్మీట్ పెట్టి.. మూడు రాజధానులపై మళ్లీ చర్చ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బుధవారం రోజున విజయసాయిరెడ్డి.. టైం అడగొద్దు… ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖకు రావడం తధ్యమని చెప్పుకొచ్చారు. గురువారం మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్మీట్ పెట్టి.. ఈ ఏడాది కాదు.. ఏ క్షణమైనా… విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుందని తేల్చేశారు. ఇప్పటికే శరవేగంగా పనులు జరుగుతున్నాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయవచ్చని.. కోర్టు తీర్పులతో సంబంధం లేదని బొత్స చెప్పుకొస్తున్నారు.
నిజంగా… ప్రభుత్వ ఉద్దేశం అయితే ఇలా ఎందుకు వరుసగా ప్రకటనలు చేస్తున్నారు..నేరుగా వెళ్లి పాలనే ప్రారంభించేవారు కదా అన్న సందేహం అందరికీ వస్తోంది. విశాఖలో రాజధాని కోసం భూములు.. భవనాలను కూడా ప్రభుత్వ పెద్దలు చూసినట్లుగా తెలుస్తోంది. సీఎం నివాసం కోసం కొండపైన స్టేట్ గెస్ట్ హౌస్ పేరుతో నిర్మాణాలు కూడా చేస్తున్నారు. అయితే.. ఎందుకు ఇప్పుడు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల్లో సైతం ఆశ్చర్యకరంగా మారింది. కరోనా వైఫల్యాలపై ప్రజల్లో చర్చ జరగకుండా మరోసారి రాజధాని అంశాన్ని వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని..విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇదంతా న్యాయవ్యవస్థను అవమానించడమేనంటున్నారు.
మొత్తానికి ప్రజల దృష్టి మళ్లించడమో.. లేకపోతే… జగన్ విశాఖ వెళ్లేందుకు సంకేతాలు పంపడమో చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. మరో వైపు.. నిన్న విజయసాయిరెడ్డి మాటలకు.. ఈ రోజు బొత్స మాటలు ఖండలన్నట్లుగా ఉన్నాయి. విజయసాయిరెడ్డి ఈ ఏడాది అంటే బొత్స.. ఆా మాటలను ఖండించి ఈ ఏడాది కాదు.. ఏ క్షణమైనా అంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో మూడు రాజధానుల కేంద్రంగా వైసీపీలో ఏదో జరుగుతోందన్న చర్చ మాత్రం ప్రారంభమైంది.