రివర్స్ టెండరింగ్.. రివర్స్ టెండరింగ్ అని వైసీపీ నేతలు కలవరించారు కానీ.. ఇప్పుడు అన్ని విషయాల్లోనూ రివర్స్ టెండరింగులే ఎదురవుతున్నాయి. దీంతో గతంలో అన్న మాటలు.. చేసిన చాలెంజ్‌లు మొత్తం రివర్స్ చేసుకోవాల్సి వస్తోంది. విద్యుత్ పీపీఏల దగ్గర్నుంచి జీఎంఆర్ ఎయిర్ పోర్టు వరకూ గత ప్రభుత్వం హయాంలో చేసిన ఆరోపణలన్నింటినీ తమకు తామే ఖండిస్తున్నట్లుగా నిర్ణయాలు తీసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు..రాజీనామాల విషయంలోనూ అదే రివర్స్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అందరూ రాజీనామాలు చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతూండటంతో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఏం చెప్పాలో తెలియక… రాజీనామాలు చేస్తే ప్రైవేటీకరణ ఆగిపోతుందా… అని ఎదురుదాడికి దిగుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం కోసం తాము రాజీనామా చేసే ప్రశ్నే లేదని తేల్చేశారు. రాజీనామాలు చేస్తే పోరాడెదెవ్వరని.. పాత కాలం డైలాగ్ ను కొత్తగా చెప్పారు. ఇతర వైసీపీ నేతలు కూడా అదే చెబుతున్నారు. ఒక వేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరితే…170 అసెంబ్లీస్థానాల్లో గెలుస్తామని కూడా ఆయన జోస్యం చెప్పారు. అదే సమయంలో పెద్దిరెడ్డి అండ్ వైసీపీ కో ప్రత్యేక హోదా ఉద్యమ సమయంలో చేసిన వ్యాఖ్యలను అనేక మంది గుర్తు చేస్తున్నారు.
చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా…రాజీనామాలు చేస్తే కేంద్రం ఎందుకు దిగిరాదో చూస్తానంటూ సవాళ్లు చేశారు. అప్పట్లో టీడీపీ ఇప్పుడు పెద్దిరెడ్డి చెప్పిన కబుర్లే చెప్పింది.రాజీనామాలు చేస్తే.. ఎవరు పోరాడతారని చెప్పింది. ఇప్పుడు పాత్రలు రివర్స్ అయ్యాయి. అప్పుడు టీడీపీ చెప్పిన కథలను ఇప్పుడు వైసీపీ చెబుతోంది. రాజీనామాలపై వైసీపీ నేతల యూటర్న్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. ఇప్పుడు అలా ఇప్పుడు ఇలా ఏమిటని ప్రశ్నలు సంధిస్తున్నారు. విమర్శిస్తున్నారు. ఎవరేమి అనుకున్నా.. తాము మాత్రం రాజీనామాలు చేసే ప్రసక్తే లేదని వైసీపీ నేతలందటున్నారు.
ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిన అవసరంలేదని.. ఎంపీలు రాజీనామా చేసి పోరాడాలని సబ్బంహరి లాంటి నేతలు సలహాలిస్తున్నారు. పార్టీలకు అతీతంగా అందరూ రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం ఏర్పడేలా చేయాలని స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు కోరుతున్నారు. అయితే.. వైసీపీ నేతలు మాత్రం… ఇరుక్కుపోయారు. తమకు రివర్స్ టెండరింగ్ పడుతోందని.. ఆవేదన చెందుతున్నారు.