దాదాపు మూడువేల కిలోమీటర్లుకుపైగా నడవాలనే సంకల్పంతో ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా నిలిచేందుకు అసెంబ్లీ సమావేశాలను సైతం ఆ పార్టీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. జగన్ యాత్ర ఏ జిల్లాకి చేరితే.. అక్కడి స్థానిక నేతలు ఏర్పాట్లు చూసుకుంటున్నారు. పార్టీపరంగా చూసుకుంటే వైకాపాకి ఈ పాదయాత్ర అత్యంత కీలకమైన కార్యక్రమం. అయితే, వైకాపా నేతలు ఈ పాదయాత్రను ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలీదుగానీ.. జగన్ కు సమాంతరంగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా యాత్రలు చేస్తున్నారు. జగన్ కు మద్దతుగా వారూ పాదయాత్రలు అంటున్నారు. ప్రస్తుతం, వైకాపా ఎమ్మెల్యే రోజా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. గాలేరు నగిరి ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ప్రభుత్వం చేస్తున్న తాత్సారానికి నిరసనగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. సత్రవాడ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర డిసెంబర్ 2 నాటికి తిరుమల చేరుకుంటుంది.
జగన్ పాదయాత్ర మొదలు కావడానికి కొద్దిరోజుల ముందే నరసరావుపేట వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఇలానే యాత్ర మొదలుపెట్టేశారు. జగన్ తలపెట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని ఆయన యాత్ర చేసేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా తిరుమలకు పాదయాత్ర చేసేశారు! జగన్ యాత్ర పరిపూర్ణం కావాలంటూ దేవుడిని కోరుతూ తిరుమలకు కాలినడక వెళ్లారు. ఇవన్నీ అధినేతకు మద్దతుగా చేస్తున్న కార్యక్రమాలుగా వైకాపా నేతలు భావిస్తున్నట్టున్నారు. కానీ, ఇది వ్యూహాత్మక లోపంగా అనొచ్చు! ఎలా అంటే.. అధినేత పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజల ఫోకస్ అంతా ఆయనపై ఉండేలానే పార్టీ కార్యాచరణ ఉండాలి. అంతేగానీ, ఇలా ఎవరికి నచ్చినట్టు వారు కూడా పాదయాత్రలకు బయలుదేరేస్తుంటే, ఇవి జగన్ కు సమాంతరంగా జరుగుతున్న కార్యక్రమాలుగా కనిపిస్తుంటాయి. ఒక్కోసారి లేనిపోని గందరగోళానికి కారణమౌతాయి.
రోజా పాదయాత్ర తీసుకుంటే.. ఆమె కాలికి బొబ్బలు అంటూ కొన్ని ఫొటోలు మీడియాలోకి వచ్చాయి. అయితే, ఇవే చిత్రాలను జగన్ ఫొటోలకు జతచేస్తూ ఆయన పాదాలకూ బొబ్బలెక్కాయంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వచ్చాయి. దీంతో అవి జగన్ పాదాలు కావు అని వైకాపా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల వల్ల కొంత నష్టం ఉంది. నిజానికి, పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్ పడుతున్న కష్టం ఇదీ, శ్రమ ఇదీ, ఆయన పట్టుదల ఇదీ, శారీరక ఇబ్బందులు ఇవీ.. అంటూ ప్రెజెంట్ చేసుకునే కథనాల ద్వారా ప్రజల్లో బాగానే సింపథీ వస్తుంది. బొబ్బలెక్కిన పాదాలు జగన్ వి అనగానే ప్రజా స్పందన ఒకలా ఉంటుంది. కాసేపటికే.. కాదు కాదు, ఆ పాదాలు రోజావి అని చెప్పడం ద్వారా ముందు కలిగిన ఫీలింగ్ తగ్గుతుంది. దీని ద్వారా ఒకరకమైన తీవ్రత తగ్గినట్టే. ప్రస్తుతం జరిగింది చిన్న విషయమే కావొచ్చు.. రేప్పొద్దున్న మరో వైకాపా నేత మళ్లీ పాదయాత్ర అంటూ బయలుదేరితే ఇలాంటిదే మరో పెద్ద ఇష్యూ కావొచ్చు. దీని వల్ల జరుగుతున్నదేంటంటే.. జగన్ చేస్తున్న పాదయాత్ర నుంచీ ప్రజల దృష్టి కొంత పక్కకు మళ్లుతుంది. మరి, ఇవన్నీ వైకాపా వ్యూహకర్తలు ఆలోచిస్తున్నారో లేదో తెలీదుగానీ.. కనీసం జగన్ పాదయాత్ర పూర్తయ్యే వరకైనా ఇతర నేతలు పాదయాత్రలకు బయలుదేరకపోతే మంచిది. జగన్ కు మద్దతు ఇవ్వాలనుకుంటే ఆయనతో కలిసి కొన్ని కిలోమీటర్లు నడవొచ్చు కదా!