ఇటీవలికాలంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం తీసుకుంటున్న అవకతవక నిర్ణయాలను కోర్టులు తప్పు పడుతున్న సంగతి తెలిసిందే. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నంత మాత్రాన ప్రజాస్వామ్యంలో ఏది పడితే అది చేయడానికి కుదరదని ప్రభుత్వాలకు కోర్టులు గుర్తు చేయాల్సి రావడం శోచనీయం. అయితే ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వివరాల్లోకి వెళితే
ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం , బిల్డ్ ఏపీ పేరిట ప్రభుత్వ (అంటే ప్రజల) ఆస్తుల అమ్మకానికి ప్రయత్నించడం, వంటి అనేక నిర్ణయాలు కోర్టు చేత మొట్టికాయలు తినేలా చేశాయి. అయితే వై ఎస్ ఆర్ సి పి అభిమానులు కోర్టుల మీద దూషణలకు పాల్పడడం, సోషల్ మీడియాలో కోర్టు తీర్పులను తప్పు పడుతూ జడ్జీలను సైతం దుర్భాషలాడటం చేయడంతో కోర్టు దీనిని తీవ్రంగా పరిగణించి సుమోటోగా కేసు నమోదు చేసింది. తమ పార్టీ తప్పు నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన హైకోర్టును , చివరికి జడ్జిలను కూడా విమర్శించిన ఒక ఎంపీ , ఒక మాజీ ఎమ్మెల్యే , 47 మంది ఇతరులకు కోర్టు ధిక్కార నోటీస్ హైకోర్టు జారీ చేసింది. దీంతో టీవీ డిబేట్ లలో వైఎస్సార్సీపీ ని వెనకేసుకు రావడానికి ఆ పార్టీ నేతలు ఇబ్బంది పడాల్సి వచ్చింది.
అయితే వైఎస్ఆర్ సీపీ ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ టీవీ ఛానల్ లో మాట్లాడుతూ, కోర్టు మీద విమర్శలు చేసిన తమ వాళ్లంతా ఇల్లీటరేట్స్ అని , ( నిరక్షరాస్యులు) కోర్టుల తీరు పై అవగాహన లేకపోవడంతోనే వారు అలా చేయాల్సి వచ్చిందని, తాను కోర్టుకు వారందరి తరఫున క్షమాపణ వేడుకుంటున్నాను అని అన్నారు. అయితే విమర్శలు చేసిన వై ఎస్ ఆర్ సి పి ఎంపీ, ఆ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కూడా నిరక్షరాస్యులైనా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. అద్దేపల్లి శ్రీధర్ వ్యాఖ్యలతో, ఇంతకాలం ఇతర పార్టీల అభిమానులను నిరక్షరాస్యులుగా పిలుస్తున్న వైఎస్ఆర్సిపి అభిమానుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా అయింది. మరోవైపు, ఆ మధ్య తన నిర్ణయాన్ని శాసనమండలి వ్యతిరేకిస్తే దానిని రద్దు చేయడానికి జగన్ నిర్ణయం తీసుకున్నాడని, ఇప్పుడు హైకోర్టును కూడా రద్దు చేయాలని జగన్ అంటారేమో అంటూ మరికొందరు నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.
ఏది ఏమైనా కోర్టుల మీద విమర్శలు చేసే ముందు , ఏ పార్టీకి చెందిన వారైనా సరే, కొంత ఆచితూచి మాట్లాడాలనే పాఠాన్ని ఈ వ్యవహారం నేర్పించింది.