వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మౌన విధానం ఎంచుకుంది. జగన్మోహన్ రెడ్డి సుప్రీకంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాయడం.. దాన్ని మీడియాకు రిలీజ్ చేయడంతో… న్యాయవ్యవస్థపై 31 క్రిమినల్ కేసుల్లోని నిందితుడు దాడి చేస్తున్నట్లుగా జాతీయ మీడియాతో పాటు.. న్యాయసంబంధిత వర్గాలు కూడా ఓ అంచనాకు వచ్చాయి. ఇదే అభిప్రాయాన్ని గట్టిగా వినిపిస్తున్నాయి. బార్ అసోసియేషన్లు ఖండించడమే కాకుండా.. జగన్మోహన్ రెడ్డిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ… సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. త్వరలో ఇవి విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో న్యాయవ్యవస్థపై.. జగన్ లేఖపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దన్న సమాచరం పార్టీ నేతలకు వెళ్లింది. ఆ లేఖ గురించి మీడియా అడిగితే తెలియనట్లుగానే మాట్లాడాలరన్నట్లుగా అందరికీ సమాచారం పంపారు.
న్యాయమూర్తులపై ఆరోపణలు చేసేందుకు.. వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేకమైన పద్దతి ఉంది. మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా లేఖలు రాసి.. వాటిని మీడియాకు విడుదల చేయడం సాధ్యం. అలా చేయడం కోర్టు ధిక్కరణ అవుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నేరుగా చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. ఆయన స్పందన కోసం వేచి చూడకుండా.. మీడియాకు విడుదల చేసేశారు. ఇక్కడ చీఫ్ జస్టిస్‌నూ అవమానించినట్లయింది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లీగల్ టీం కూడా ఇక నుంచి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోతే మంచిదనే అభిప్రాయాన్ని ఆయనకు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో.. పార్టీ నేతలందరికీ.. ఇదే సందేశాన్ని … సజ్జల రామకృష్ణారెడ్డి పంపించారు.
సాధారణంగా న్యాయవ్యవస్థపై ఎవైనా వ్యాఖ్యలు చేయాలంటే… పార్టీ కార్యాలయం నుంచి ఆయా పార్టీ నేతలకు స్క్రిప్ట్ వెళ్తుంది. వారు చెప్పినట్లుగానే నేతలు విమర్శలు చేస్తారు. వారు చెప్పకపోతే.. కోర్టుల మీద వ్యాఖ్యలు చేసేంత సాహసానికి వైసీపీ నేతలు ఒడిగట్టరు. ఏం జరిగినా తామున్నామని చూసుకుంటామని భరోసా ఇచ్చి అలాంటి విమర్శలు చేస్తారని చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఇక ఎవరూ మాట్లాడవద్దని.. గతంలో అలా మాట్లాడమని చెప్పినప్పటికీ.. ఇప్పుడు ఇక నోరు తెరవవద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది. వైసీపీ సైలెన్స్ వెనుక అంతరార్థం ఏమిటదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని ఓ వర్గం చెబుతూంటే.. అలాంటి వాటికి వెనక్కి తగ్గే అవకాశం లేదని.. పరిస్థితిని గమనించి మరింత తీవ్రమైన వ్యాఖ్యలతో విరుచుకుపడతారని మరో వర్గం చెబుతోంది.