హైదరాబాద్లో పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న వైఎస్ సంస్మరణ సభకు వెళ్లకూడదని వైసీపీ హైకమాండ్ నిర్ణయించింది. అది రాజకీయ కార్యక్రమంగానే వైసీపీ నేతలు అంచనా వేశారు. ఆ సమావేశానికి వెళ్తే లేనిపోని సమస్యలు వస్తాయని అందుకే వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. వైసీపీలోని అత్యంత సీనియర్లు అయిన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు టీడీపీలో ఉన్న పితాని సత్యనారాయణ వంటి వారికి ఆహ్వానాలు వెళ్లాయి. టీడీపీలో ఉన్న వారు వెళ్తారో లేదో కానీ వైసీపీ నేతలకు మాత్రం వెళ్లవద్దని పై నుంచి ఆదేశాలు వచ్చాయి.
తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ విజయలక్ష్మి సమావేశాన్ని రాజకీయ సమావేశంగా పేర్కొన్నారు. వైఎస్ షర్మిల కోసం ఆమె సభ ఏర్పాటు చేశారని అందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. అయితే అది ఆత్మీయ సమావేశమని రాజకీయాలకు సంబంధం లేదని విజయలక్ష్మి సన్నిహితులు మీడియాకు చెబుతున్నారు. అందుకే అన్ని పార్టీల నేతలనూ పిలుస్తున్నట్లుగా చెబుతున్నరాు. అయితే సజ్జల మాత్రం విజయలక్ష్మి సమావేశంపై రాజకీయ ముద్ర వేయడానికి ప్రయత్నించారు. అది షర్మిల పార్టీ సమావేశం కాబట్టే తాము హాజరు కావడం లేదని చెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో వైసీపీ విధానం ఏమిటో తెలిసిపోయింది.
వైఎస్ సంస్మరణ సభకు ఎవరెవరు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆ సభ సీఎం జగన్ను ఇష్టం లేదని తెలియడంతో వైసీపీ నేతలు ఎవరూ వెళ్లే సాసహం చేయరు. ఆయనకు ఇష్టం లేదని తెలిస్తే ఇతర నేతలు కూడా వెళ్లకపోవచ్చంటున్నారు. చివరికి చిరంజీవి, నాగార్జున, కృష్ణ వంటి వారికి కూడా ఆహ్వానం పంపారు. జగన్ కు ఇష్టం లేకుండా వెళ్లడానికి వారు కూడా జంకుతారు. వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. వెళ్తే ఓ తంటా.. వెళ్లకపోతే మరో ఇబ్బంది అన్నట్లుగా మారారు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఎక్కువ మంది డుమ్మా కొట్టే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.
వైఎస్ఆర్ సంస్మరణ సభను వైఎస్ షర్మిలనే కోఆర్డినేట్ చేస్తున్నారు. పేరుకు విజయలక్ష్మి అయినా కార్యక్రమం మొత్తం షర్మిల నడిపిస్తున్నారు. దీంతో ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఆమె పార్టీ కోసం పెట్టారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ కారణంగా సమావేశానికి ఇతర పార్టీల నుంచి హాజరయ్యే వారి సంఖ్య పరిమితంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా లేని వైఎస్ సన్నిహితులు మాత్రం హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు.