కరోనా వస్తుంది .. పోతుంది..! భవిష్యత్‌లో కరోనా రాని వాళ్లంటూ ఎవరూ ఉండరనే… ముఖ్యమంత్రి జగన్ మాటలను.. వైసీపీ నేతలు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. సామాన్య ప్రజలకు లెక్క లేనన్ని ఆంక్షలు పెడుతున్నారు. ప్రజలు కూడా కరోనా సోకుతుందేమోనన్న భయంతో వీలైనంత వరకూ.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే.. వైసీపీ నేతలు.. మాత్రం.. తాము కరోనాకు అతీతం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడికక్కడ కోవిడ్ నిబంధనలు పాటించకుండా… సభలు.. సమావేశాలు.. శుభకార్యాలు నిర్వహించేసుకుంటున్నారు. ఇంకా తీవ్రమైన విషయం ఏమిటంటే.. పాజిటివ్ తేలిన నేతలు … హోం ఐసోలేషన్‌లో.. చికిత్స చేయించుకోవడమో చేయకుండా.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇలా జరుగుతున్న కార్యక్రమాల్లో కరోనా కేసులు భారీగా బయటపడుతున్నాయి. కొన్ని కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి.
ఇంట్లో పెళ్లి చేసి 2 వేల మందికి కరోనా టెన్షన్ తెచ్చిపెట్టిన బాపట్ల ఎంపీ..!
బాపట్ల ఎంపీ నందిగం సురేష్.. తన ఇంట్లో శుభకార్యాన్ని నిర్వహించారు. శుభకార్యాలకు ఇప్పుడు తాహశీల్దార్ల అనుమతి తీసుకోవాలి. అదీ కూడా ఇరవై మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ.. నందిగం సురేష్ కుటుంబంలో జరిగిన శుభకార్యానికి రెండు వేల మంది హాజరయ్యారు. ఒక్క కోవిడ్ నిబంధన పట్టించుకోలేదు. సగం మందికిపైగా అతిధులకు మాస్కుల్లేవు. ఆ పెళ్లికి హాజరైన వారికి పలువురుకి తర్వాత కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. ఇరవై మందికి పాజిటివ్‌గా తేలింది. ఇంకా పలువురు రిపోర్టులు రావాల్సి ఉంది. ఈ పెళ్లి వ్యవహారం… కరోనా వ్యాప్తి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కరోనా పాజిటివ్ వచ్చినా ప్రజా సేవకు వైసీపీ నేతల పరుగులు..!
ఒక్క నందిగం సురేష్ మాత్రమే కాదు.. వైసీపీ చోటా లీడర్లు కూడా… కోవిడ్ నిబంధనలు పట్టించుకోవడం లేదు. నిబంధనలు పెట్టింది ప్రభుత్వం.. ఆ ప్రభుత్వం మాదే కాబట్టి.. పాటించాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. వైసీపీ నేతల ఆలోచనా సరళి ఎంత దారుణంగా ఉంటోందంటే.. కరోనా వచ్చినా కూడా.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో గౌని ఉపేందర్ రెడ్డి అనే వైసీపీ నేతకు నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన రెండో రోజే.. ఎమ్మెల్యేతో కలిసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విషయం తెలిసి.. అధికారులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ అధికారులంతా టెన్షన్ పడుతున్నారు. అంటే.. కరోనా వచ్చినా సరే.. వైసీపీ నేతలు.. సూపర్ స్ప్రెడర్లుగా మారుతున్నారు కానీ.. కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు.
వైసీపీ నేతలు చేపట్టిన కార్యక్రమాలతో పెరుగుతున్న వైరస్ కేసులు..!
ఈ నెల ప్రారంభంలో జరిగిన వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు… వైరస్ వ్యాప్తి కారకాలుగా మిగిలాయి. అనేక చోట్ల.. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలకు వైరస్ సోకింది. ఇక వైసీపీ నేతల పుట్టినరోజుల వేడుకలు.. ఇతర పార్టీ కార్యక్రమాలు…. గుంపులు గుంపులుగా నిర్వహిస్తున్నారు. ఫలితంగా కరోనా వచ్చినప్పటి నుండి ఎన్ 95 మాస్క్.. చేతులకు గ్లౌజులతోనే కనిపించే విజయసాయిరెడ్డి లాంటి వారి కూడా వైరస్ సోకింది. వారికి సోకడం మాత్రమే సమస్య కాదు.. అంతకు మించి.. వారు సూపర్ స్ప్రెడర్లుగా మారడమే… ఏపీని ప్రమాదకర పరిస్థితికి నెడుతున్న కారణం.